ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క
సినిమా భ్రమల్లో కేటీఆర్.. అబద్ధాల పుట్టగా బీఆర్ఎస్
రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే.
కడ్తాల్‌లో ఎంపీ మల్లురవి,ఎమ్మెల్యే కసిరెడ్డితో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క.
రంగారెడ్డి, జూన్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) సగం సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President KTR) కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)(Minister Seethakka) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌లో నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి(Nagarkurnool MP Mallu Ravi),స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆమె నూతన ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, కేటీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కోట్ల మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న "ప్రజా పాలన"ను సినిమాతో పోల్చడం కేటీఆర్ అహంకారానికి, అపరిపక్వ ఆలోచనా విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కేవలం అబద్ధాల పుట్టగా మారిందని, పదేళ్ల అధికార మదంతో విర్రవీగిన ఆ పార్టీ నాయకులు ఇప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించడం లేదని విమర్శించారు. కేటీఆర్ ఇంకా సినిమా భ్రమల్లోనే బతుకుతున్నారని, ఇప్పటికైనా ఆ భ్రమల నుంచి బయటకు వచ్చి, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి ఒక బాధ్యతాయుతమైన, నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు. కేటీఆర్ అనుకున్న వ్యక్తిగత, లౌక్యపు ఆలోచనలు అమలు కానంత మాత్రాన ప్రభుత్వ పాలన విఫలమైనట్టు కాదని ఆమె స్పష్టం చేశారు.
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రచారాలకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. దేశంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనమైన చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతుల అప్పులు మాఫీ చేసి ఆదుకున్నామని, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోనూ ఇచ్చిన మాట ప్రకారం అంతటి భారీ రైతు రుణమాఫీని అత్యంత పారదర్శకంగా చేపట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నామని గుర్తుచేశారు.
మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు..
కేవలం సాంప్రదాయ పంటలకే పరిమితం కాకుండా, మార్కెట్‌లో మారుతున్న డిమాండ్‌కు అనుగుణంగా లాభదాయకమైన పంటల సాగు వైపు రైతులను మళ్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి వెల్లడించారు. దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు.కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భవిష్యత్తులో కడ్తాల్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.






