22 April, 2026 | 1:32 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

22-04-2026 11:54 AM

పేదల గడప వద్దకే సంక్షేమ పథకాలు

ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు కొనసాగింపు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి

ఖమ్మం,(విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఖమ్మం నగరం 1వ, 59వ, 60వ డివిజన్‌లకు చెందిన (27) మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల గడప వద్దకే పథకాలను చేరవేస్తున్నామని అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ప్రారంభించిన మంచి పథకాలను నిలిపివేయకుండా కొనసాగిస్తున్నామని తెలిపారు. అదనంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి పంటకు 6 వేల రైతు భరోసా, సన్న బియ్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఆపద సమయంలో పేదలకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేస్తున్నామని, పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందించేందుకు 20 నుంచి 25 ఎకరాల్లో 2500 మంది విద్యార్థులు చదివే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్  స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మొటిక్ ఛార్జీలను 200 శాతం పెంచినట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేస్తున్నాయని, ఈ ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాన్ని ఆపిందో చెప్పాలని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వం ఇండ్ల పేరుతో పేదలను మోసం చేసిందని, అయితే తమ ప్రభుత్వం తొలి దశలోనే సుమారు 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో రెండో దశ ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు అందజేస్తామని, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కల్పిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ చేయలేదని, ప్రజలు ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలను గమనిస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షాలకు తగిన సమాధానం ఇచ్చి తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపారని అన్నారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తుందని, ప్రజలు ఎల్లప్పుడూ ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకు గ్యాస్ సిలిండర్, నూతన రేషన్ కార్డుల పంపిణీ వంటి కార్యక్రమాలు ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదల సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ అనిత, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఆర్డీఓ శ్రీనివాస్, అర్బన్ తహసీల్దార్ జయచందర్,  కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.