కాంట్రాక్టర్లతో మంత్రి కోమటిరెడ్డి చర్చలు, బుజ్జగింపులు
- బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు భారీగా బకాయిలు
- త్వరలోనే తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణం
- దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చారా?
- దళితుడిని సీఎంగా చేస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారా?
హైదరాబాద్: తెలంగాణలో కాంట్రాక్టర్లకు దాదాపు రూ. 3 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కాంట్రాక్టర్లతో మంత్రి కోమటి రెడ్డి బుజ్జగింపులు జరిపారు. రేవంత్ ప్రభుత్వ తీరుకు నిరసనగా కాంట్రాక్టర్లు ఈనెల 18న చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నిరసన కార్యక్రమం విరమించుకోవాలని మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) కాంట్రాక్టర్లకు భారీగా బకాయిలు పెట్టిందని ఆరోపించారు. తనకు అవసరమైన కాంట్రాక్టర్లకు మాత్రమే కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బిల్లులు మంజూరు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు(Kaleshwaram Project Contractors) మినహా ఎవరికీ బిల్లులు చెల్లించలేదని చెప్పారు.
వందల కోట్ల బిల్లులు పెండింగ్ వల్ల కాంట్రాక్టర్లు తీవ్రంగా నష్టపోయారని సూచించారు. బిల్లులు పెండింగ్ వల్ల ఆరుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో రూ. 13,500 కోట్ల వ్యయంతో హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రారంభిస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. కేంద్రంతో సంప్రదించి జాతీయ హైవేలు కూడా మంజూరు చేయించినట్లు మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు(Pending bills) మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. పదేళ్ల విధ్వంసాన్ని సరిచేసేందుకు కొంత సమయం పడుతోందన్నన్న మంత్రి కాంట్రాక్టర్లు ఆందోళన విరమించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పనులు ఆపితే.. వర్షాకాలంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడతారని సూచించారు.
గత ప్రభుత్వం టిమ్స్ నిర్మాణాలకు రూ. 10 వేల కోట్లు అని చెప్పింది.. గత ప్రభుత్వం టిమ్స్ నిర్మాణానికి రూపాయి కూడా చెల్లించలేదని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. టిమ్స్ నిర్మిస్తున్న సంస్థలకు ఇప్పుడు తాము బిల్లులు చెల్లిస్తున్నామని వివరించారు. చిన్నచిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు క్రమంగా బిల్లులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు. పేదలకు పదేళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వని వాళ్లు ఇవ్వాళ తమను ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. దళితులకు మూడెకరాలు ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చారా?, దళితుడిని సీఎంగా చేస్తామన్న హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నారా? అని మంత్రి కోమటిరెడ్డి ప్రశ్నించారు.






