16 June, 2026 | 2:55 PM

యూరియా పంపిణీ కేంద్రాలపై కలెక్టర్, ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

16-06-2026 01:22 PM

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ఖరీఫ్ సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు సకాలంలో, పారదర్శకంగా అందేలా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మంగళవారం యూరియా పంపిణీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాగర్‌ కర్నూల్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల విక్రయ కేంద్రం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్), ప్రైవేట్ ఎరువుల దుకాణాలను సందర్శించి యూరియా నిల్వలు, విక్రయాలు, ఆన్‌లైన్ పంపిణీ విధానాన్ని పరిశీలించారు.

గ్రోమోర్ కేంద్రంలో యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, లైసెన్సులు, నానో యూరియా, నానో డీఏపీ లభ్యతపై వివరాలు సేకరించిన కలెక్టర్, జిల్లాలో ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పీఏసీఎస్ కేంద్రంలో రైతుల ఆధార్ ధృవీకరణ, బయోమెట్రిక్ నమోదు, పీఓఎస్ యంత్రాల ద్వారా జరుగుతున్న విక్రయాలను పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎరువులు అందేలా చూడాలని సూచించారు.

ఎరువుల సరఫరా, విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమ నిల్వలు చేయడం, అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలను సహించబోమని హెచ్చరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో అవసరమైన మేరకు యూరియా నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఖరీఫ్ కాలంలో ఎరువుల నిల్వలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు.