11 August, 2026 | 2:05 PM

నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్

11-08-2026 12:51 PM

హైదరాబాద్: కర్ణాటకలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మధ్య బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి తన పేరును తొలగించారని నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. రాష్ట్రం ఓటర్ల జాబితాలను నవీకరించే ప్రక్రియను కొనసాగిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సర్ (SIR) ప్రక్రియలో పేర్లు గుర్తించబడిన ఓటర్లు తమ వివరాలను సరిచూసుకోవాలని, ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

బెంగళూరులో తన ఓటు గల్లంతయ్యిందని ప్రకాశ్ రాజ్ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన ఇలా అన్నారు. ప్రియ మిత్రులారా, నేను మీతో ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. పుట్టి పెరిగిన బెంగళూరు నియోజకవర్గంలో నా ఓటు తొలగించారని, బెంగళూరు నియోజకవర్గం నుండి ఓటు హక్కు తొలగించబడిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని అని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు.  మంచి జోక్, కదూ? నేను ఈ నియోజకవర్గంలోనే పుట్టాను. ఈ నియోజకవర్గంలోనే నివసించాను. నా పాఠశాల విద్య, కళాశాల విద్య, నాటకరంగం అన్నీ ఇక్కడే జరిగాయని, మీ సమాచారం కోసం చెబుతున్నాను, నేను ఈ నియోజకవర్గం నుంచే ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసిన నా ఓటు తొలగించారని వెల్లడించారు. 

ఎస్ఐఆర్ ప్రక్రియలో అసలు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. నా ఓటు పొందేందుకు ఏ పత్రాలు చూపించాలో తెలుసుకుంటానని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దేశ పౌరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. డియర్ ఫ్రెండ్ నువ్వు మా ఓట్లు తొలగించగలవు కానీ, నిన్ను గద్దె దించకుండా మిమ్మల్ని అడ్డుకోలేవని అన్నారు.