మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!
గంభీరావుపేట–లింగన్నపేట మధ్య రాకపోకలు నిలిచివేత
గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న హై లెవెల్ బ్రిడ్జి పనుల నిమిత్తం తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డును కాంట్రాక్టర్ తొలగించారు. ఎగువ మానేరు ప్రాజెక్టు నుండి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో మట్టి రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటదని జెసిబి సహాయంతో ముందస్తుగా రోడ్డు తొలగించారు.
ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువ మానేరు మత్తడి దూకడం, మట్టి రోడ్డు కొట్టుకుపోవడం సాధారణంగా మారింది. దీంతో గంభీరావుపేట- లింగన్నపేట మధ్య రాకపోకలు నెలల తరబడి నిలిచిపోతున్నాయి. ఈ మార్గం కామారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు ప్రధాన రహదారిగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, ప్రతి సారి వరదల వల్ల రోడ్డు దెబ్బతినడం సహజమే అయినప్పటికీ, ఈసారి ముందుగానే కాంట్రాక్టర్ మట్టి రోడ్డును తొలగించడం పట్ల స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.






