16 May, 2026 | 10:52 PM

ధాన్యం దిగుమతుల్లో మిల్లర్లు అలసత్వం వీడాలి: కలెక్టర్

16-05-2026 09:45 PM

* కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు మిల్లర్లకు ఆదేశాలు

* ప్రభుత్వ ఆదేశాలను  పెడచెవిని పెడుతున్న మిల్లర్లు 

* రైతులకు తీవ్ర ఇబ్బందులు 

* రెండు రైస్ మిల్లులు బ్లాక్‌లిస్ట్

* పాపన్నపేట మండలం మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, రామాయంపేట్ మేసర్స్ భవాని ఇండస్ట్రీస్ పై చర్యలు

* మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

పాపన్నపేట: ధాన్యం దిగుమతుల్లో అలసత్వం వహించిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. రబీ మార్కెటింగ్ సీజన్ 2025-26 (యాసంగి) సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించేందుకు అన్ని రైస్ మిల్లర్లు పీపీసీల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకొని కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని పలు మార్లు ఆదేశాలు జారీ చేయబడ్డాయని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.

కొనుగోలు కేంద్రాల ధాన్యం దిగుమతులపై కలెక్టర్ మాట్లాడుతూ.. కష్టం మిల్లింగ్ ఆపరేషన్లో తప్పనిసరిగా పాల్గొనాలని పలుమార్లు వెల్లడించిన మిల్లర్లు ఆ మాటలు పెడచెవిని పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని దృష్టిలో పెట్టుకుని, మేసర్స్ శ్రీ సాయి లక్ష్మీ ట్రేడర్స్, పాపన్నపేట మండలం, మేసర్స్ భవాని ఇండస్ట్రీస్, రామాయంపేట్ పీపీసీల నుండి కేటాయించిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం గమనించబడినది. దీనివల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో, సంబంధిత జి.ఓ నిబంధనల ప్రకారం పై రైస్ మిల్లులను పాడి ప్రొక్యూర్‌మెంట్ మరియు కస్టమ్ మిల్లింగ్ ఆపరేషన్స్ నుండి తక్షణ ప్రభావంతో బ్లాక్ / బ్లాక్‌లిస్ట్ చేయడం జరిగిందన్నారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఆయా రైస్ మిల్లులకు ఎటువంటి ధాన్యం కేటాయింపు చేయబడవని వెల్లడించారు. అలాగే జిల్లాలోని అన్ని రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ పీపీసీల నుండి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత రైస్ మిల్లులపై కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.