బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ విచారణ సందర్భంగా, సర్ ప్రక్రియపై ఏర్పాటు చేసిన ట్రిబ్యునళ్ల పనితీరును సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు స్పష్టం చేసింది. ఈ ట్రిబ్యునళ్ల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే, వాటి కార్యకలాపాలలో మార్పులు చేయవచ్చని న్యాయస్థానం పేర్కొంది. ఈ ట్రిబ్యునళ్ల పనితీరుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం నుండి కోరారు. అలాగే తదుపరి విచారణ ఆగస్టు 25న జరగనుంది.
విచారణ ప్రారంభంలో, గణనీయమైన సమయం గడిచిపోయిందని సుప్రీంకోర్టు పేర్కొంది. కాబట్టి ఇప్పటివరకు ఎన్ని కేసులు పరిష్కరించబడ్డాయో అంచనా వేయడం అవసరమని, ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పని వేగం చూస్తుంటే అన్ని అప్పీళ్ల విచారణలు ముగిసేలోపే తదుపరి ఎన్నికలు వచ్చేస్తాయని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ న్యాయవాది ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు. ఈ విషయంపై జస్టిస్ బాగ్చీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కేవలం అప్పీల్ దాఖలు చేయడం వల్ల ఒక వ్యక్తికి ఉపశమనం లభించదని ఆయన తెలిపారు. ఈ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసిన వారు వాటి ఫలితాలను కూడా పరిశీలించాలన్నారు.






