10 April, 2026 | 2:51 AM

హనుమకొండ, వరంగల్‌ను కలపండి

10-04-2026 01:14 AM
  1. మహానగరాన్ని అభివృద్ధి చేయండి
  2. పౌర సంఘాల బాధ్యులు, మేధావులు, నాయకుల డిమాండ్
  3. మహానగరాన్ని రెండు జిల్లాలుగా విడగొట్టి అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారని ఆందోళన

హనుమకొండ, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో విలీనంచేసి ఈ మహానగరాన్ని రాష్ట్రంలో రెండో అతి పెద్ద నగరంగా తీర్చిదిద్దాలని పౌర సంఘాలు, మేధావులు, నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. గురువారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో విశ్రాంత ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన పౌర సంఘాలు, మేధావులు, నాయకులు ‘హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలపండి.. మహానగరాన్ని అభివృద్ధి చేయండి’ నినాదంతో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ సాధిస్తే రాష్ట్ర రాజధానితోపాటు ఉమ్మడి జిల్లాల కేంద్రాలు అభివృద్ధి చోదక కేంద్రాలుగా ఎదుగుతాయని ఆశించిన ప్రజలకు తీవ్ర నిరాశే మిగిలిం దని ఆవేదన వ్యక్తంచేశారు. 40 ఏండ్ల నుంచి తెలంగాణ అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నదని, అన్ని జిల్లాలతో కలిసి మూడు కోట్ల ఆరవై లక్షల మంది ప్రజలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరంగా ఎదుగుతున్న వరంగల్‌ను ముక్కలు చేసి, నగరం భూములను, పార్కులను కబ్జా చేసి, జైలును కూలగొట్టి భూములను మహారాష్ట్ర బ్యాంకుకు తాకట్టు పెట్టి నగరం అభివృద్ధిని విచ్ఛిన్నం చేశారని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రస్తుత ప్రభుత్వం కూడా రెండు జిల్లాలను కలపడంలోనూ, వరంగల్ మహానగరాన్ని పునర్నిర్మాణం చేయడం లోనూ తత్సారం చేస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలు రాష్ట్రంలోని అనేక జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయని, ముఖ్యంగా హనుమకొండ జిల్లా దయనీ యంగా 33వ స్థానంలో ఉన్నదని ఫోరం ఫర్ బెటర్ వరంగల్ చైర్మన్ కొండూరు సుధాకర్ ప్రభుత్వ గణాంకాలతో వివరించారు. 

ఓర్వలేకనే విభజన

ఉద్యమ ఫలితంగా ఈ రెండు జిల్లాలను వరంగల్ జిల్లాగా ప్రకటించడానికి సిద్ధపడ్డ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను ఆక్షేపిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం చేసిన ప్రకటన అడ్డుపుల్లగా మారిందని వరంగల్ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రజల మనోభావాలను గౌరవిస్తూనే 1,400 ఏండ్ల చారిత్రక నేప థ్యం ఉన్న వరంగల్ నగర ప్రజల ఆకాంక్షను ఇంకెంతో కాలం నిర్లక్ష్యం చేయకూడదని హితవుపలికారు.

వరంగల్ ఈస్ట్ చుట్టూ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అభివృద్ధికి అవసరమైన జంక్షన్‌లను నిర్మించి, మౌలికవసతులతో పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడాలని కోరారు. మార్క్సిస్ట్ కమ్యూని స్టు పార్టీ నాయకులు చుక్కయ్య మాట్లాడుతూ.. జిల్లా విభజనతో వరంగల్ మహానగర అభివృద్ధిని అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనేక పోరాటాలకు పురిటిగడ్డ అయిన వరంగల్ నగర ప్రజల ఐక్యతను, రాజకీయ చైతన్యాన్ని ఓర్వలేకనే నగరాన్ని విభజించారని ఆరోపించారు.

ప్రముఖ జర్నలిస్టు దాసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు ఐక్యతతో ప్రభుత్వాన్ని ఒప్పించి నగర ఏకీకరణతోపాటు జిల్లా పునర్నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెంకటరాజ్యం మాట్లాడుతూ.. కేవలం పాలకుల కాంట్రాక్టులు, వ్యాపారాల కోసమే నగరాన్ని విభజించారని, నగర ప్రజలు మాత్రం ఏనాడూ విభజనను కోరలేదని స్పష్టంచేశారు.

ఈ సదస్సులో ప్రొఫెసర్ వీ రవీందర్, టీ శ్రీనివాస్, డాక్టర్ విజయలక్ష్మి, వీ బాబురావు, ప్రముఖ అడ్వకేట్ చిల్లా రాజేంద్రప్రసాద్, జిలకర శ్రీనివాస్, సోమ రామమూర్తి, సాయినీ నరేందర్, సంఘానీ మల్లేశ్వర్, డాక్టర్ వీరస్వామి, రాయపురపు సాంబయ్య, సోమిడి శ్రీనివాస్ వనజా పటేల్, సిరిపురం అరుణ, మాదిరెడ్డి మల్లారెడ్డి, దారబోయిన సతీశ్, డాక్టర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.