పెంచిన ఇందన ధరలను... వెంటనే ఉపసంహరించుకోండి
అకాల వర్షాల వల్ల నష్ట పోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోండి
జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికి వినతి పత్రం సమర్పణ
ఇఫ్టూ షేక్ షావలి, పిఓడబ్ల్యూ(విముక్తి)పెర్క సునీత విజ్ఞప్తి
జవహర్ నగర్,(విజయక్రాంతి): అంతర్జాతీయంగా ఆయిల్ ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, కేంద్రం ప్రభుత్వం నెలలో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని ఇఫ్టు కార్యదర్శి షేక్ షావలి, పిఓడబ్ల్యూ(విముక్తి) సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శి పెర్క సునీత తీవ్రంగా ఖండించారు. ఈ నెలలోనే రెండుసార్లు తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ధరల పెంపుపై ఆకాల వర్షాల వలన నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలని సిపిఐ(ఎం.ఎల్) చండ్రపుల్లారెడ్డి పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో బాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలేక్టర్ కార్యాలయంలో శనివారం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా అధనపు కలేక్టర్ డి.విజయేందర్ రెడ్డికి సమస్యలను వివరించారు. గత 12 సంవత్సరాలుగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు పెట్రో ధరలు తగ్గించాల్సింది పోయి, యుద్దం భూచిని చూపి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. రోజురోజుకు ఆకాశాన్ని తాకిన నిత్యవసరాల ధరలతో తల్లడిల్లుతున్న సామాన్య పేద,మధ్యతరగతి ప్రజానీకంపై మరోసారి పెట్రో ధరలు పెంచడానికి సిద్దపడిన కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక చర్యలను ఖండించారు. ప్రజల నడ్డివిరిచే దుర్మార్గమైన రాజకీయ విధానాలు దేశాన్ని, దేశ ప్రజలను బడా కార్పొరేట్ సంస్థల దోపిడీకి తాకట్టుపెట్టడమేనని మండిపడ్డారు.
ఒకవైపు నిరుద్యోగం, ఆకలి, దారిద్య్రం, ఆత్మహత్యలకు గురౌతున్న ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉండగా, మరోవైపు ప్రజలపై ద్రవ్యోల్బణం బారాన్ని నెట్టి, రూపాయి పతనానికి కారణమైన కేంద్ర ప్రభుత్వం అన్నిరంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. చిన్న, పెద్ద పరిశ్రమలు మూతపడి కార్మికులు వీధిన పడ్డారని, ఏ.ఐ.తో సాఫ్ట్ వ్వేర్ ఉద్యోగుల భద్రత అగమ్య గోచరంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు, ప్రకటనలు ఆచరణకు నోచుకోవటం లేదని అన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వలన పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని కల్లబొల్లి కబుర్లతో నిర్లక్ష్య దోరణిని ప్రదర్శిస్తున్నారని అన్నారు.
ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించి, కమర్షియల్, ఇంటి వంట గ్యాస్ ధరలు పాత ధరలకే సరఫరా చేయాలని, అమెరికా ఒత్తిళ్ళకు తలోగ్గకుండ ఆయిల్ చమురు సంక్షోభ నివారణకు ఇరాన్, రష్యా ల నుండి కొనుగోలు చేయాలని, తడిసిన పొద్దుతిరుగుడు, వడ్లు, మొక్కజొన్నల ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా, కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, పంటలు దెబ్బతిని, అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు తగిన ఎక్స్ గ్రేషియా ప్రకటించి, అన్నివిధాలా ఆదుకోవాలని ఈ సందర్భంగా షేక్ షావలి, పెర్క సునీత తదితరులు విజ్ఞప్తి చేశారు.






