ఆశా వర్కర్ల జీతం రూ.18వేలకు పెంచాలని ఎమ్మెల్యే జారేకు వినతిపత్రం
దమ్మపేట, మార్చి 12,( విజయక్రాంతి): రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశ వర్కర్లకు రూ 18,000 ఫికస్డ్ వేతనం నిర్ణయించాలని, ఆశ వర్కర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు సి ఐ టి యు ఆధ్వర్యంలో గురువారం గండుగులపల్లిలో అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ ఆశ వర్కర్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య సేవలు ప్రజల మన్ననలు పొందుతున్నారని, కానీ ఇస్తున్నటువంటి పారితోషికాలు జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు పెండింగ్లో ఉంటే ఎలా బతకగలరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ 50 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ హామీలు రెండు సంవత్సరాల పూర్తయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాగ్దానాల ఊసెత్తడం లేదని అన్నారు.
పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, రామకృష్ణ, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీత, శారద, సంధ్య, సుభద్ర, రామలక్ష్మి, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.




