10 August, 2026 | 8:35 PM

పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణపై అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం

10-08-2026 07:15 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ చిత్రా మిశ్రా  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల సౌలభ్యం దృష్ట్యా పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ  సాధారణ ప్రక్రియ అని తెలిపారు.

ప్రతి పోలింగ్ స్టేషన్లో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నట్లయితే ఆ ఓటర్లను మరో పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరుస్తామని తెలిపారు. అలాగే సౌకర్యాలు లేని శిథిలావస్థలో ఉన్న పోలింగ్ స్టేషన్లను మరోచోటికి మార్చడం, ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలను మరో స్టేషన్లో కలపడం వంటి వాటికి ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ విచారించగా అంతా సజావుగానే సాగినట్లు వారు తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్డీవో జల కుమారి, బిజెపి పార్టీ ప్రతినిధి నాంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మడుపు మోహన చారి, ఎంఐఎం పార్టీ ప్రతినిధి సయ్యద్ ఇబ్రహీం, టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సాతినేని శ్రీనివాస్, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.