అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధుల సమావేశం
దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో సోషల్ మీడియా మండల కోఆర్డినేటర్లు, గ్రామ పంచాయతీ కోఆర్డినేటర్లు, సోషల్ మీడియా ప్రతినిధులతో దమ్మపేట మండలం పట్వారిగూడెం గ్రామంలో చెలికాని ఆదెమ్మ ఫంక్షన్ హాల్ నందు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు, సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ & ట్రాన్స్పోర్ట్ అథారిటీ కమిటీ మెంబర్ పెట్టం నవీన్, సోషల్ మీడియా స్టేట్ సెక్రటరీ & కర్మాన్ఘాట్ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబాబాద్ కౌన్సిలర్ అంబాల శివకుమార్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం పార్లమెంట్ ఇన్‌చార్జ్ వీరాపురం రామలక్ష్మణ్ హాజరై పార్టీ బలోపేతానికి అవసరమైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ... నియోజకవర్గానికి సంబంధించిన రోజువారీ స్థానిక అంశాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చేరవేయాలని సూచించారు. అలాగే పీసీసీ, ఏఐసీసీ కార్యక్రమాలు, స్థానిక నాయకుల పర్యటనలు, ప్రజా సమావేశాలు, పార్టీ కార్యకలాపాలను ప్రజలకు చేరేలా రీల్స్, వీడియోలు, గ్రాఫిక్స్ ల ద్వారా ప్రజల అభిప్రాయాలతో కూడిన కంటెంట్‌ను నిరంతరం రూపొందించి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. వాట్సాప్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా మండలాల వారీగా బూత్ స్థాయిలో కమ్యూనికేషన్ గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతిరోజూ పార్టీ సమాచారాన్ని క్రమబద్ధంగా ప్రజలకు చేరవేయాలని సూచించారు.
ప్రతి సందేశం వాస్తవాల ఆధారంగా ఉండాలని, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలను వెంటనే గుర్తించి వాస్తవ నిర్ధారణ చేసి ప్రజలకు సరైన సమాచారం అందించాలని నాయకులు సూచించారు. ముఖ్యమైన అంశాలపై వెంటనే ఉన్నత స్థాయి నాయకత్వానికి సమాచారం అందించే విధానాన్ని పాటించాలని తెలిపారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగిస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. అలాగే సోషల్ మీడియా ప్రతినిధులకు ప్రభావవంతమైన పోస్టుల తయారీ వీడియో, ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైన్, సోషల్ మీడియా చేరిక పెంపు, కృత్రిమ మేధస్సు, (AI) ఆధారిత కంటెంట్ తయారీ వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
రాబోయే 30 రోజులలో అశ్వారావుపేట నియోజకవర్గ సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను విస్తరించడం, మండల, బూత్ స్థాయి బృందాలను మరింత బలోపేతం చేయడం సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రతిరోజూ కంటెంట్ పోస్టింగ్, నివేదికల సమర్పణను కచ్చితంగా అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రజాసమస్యల పరిష్కారం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించాలని నాయకులు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాకు సంబంధించిన అధికారిక అన్ని వెబ్సైట్లను సమర్థవంతంగా నిర్వహించాలని కోఆర్డినేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐదు మండలాల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.






