తనిఖీలు కొండంత.. చర్యలు గోరంత!
- సీఎంసీ పరిధిలో లైసెన్సు లేని హోటళ్ల ఇష్టారాజ్యం
- కల్తీ ఆహారంతో రోగాల బారిన ప్రజలు
శేరిలింగంపల్లి, జూలై 2 (విజయక్రాంతి): గచ్చిబౌలిలోని ఒక ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు అకస్మాత్తుగా తనిఖీలు నిర్వహించారు. వంటగదిలో కుళ్లిన కోడి మాంసం, గడువు ముగిసిన పాలు, క్రీమ్ ప్యాకెట్లు, ఈగలు ముసురుతున్న వంట టేబుళ్లు చూసి అధికారులు షాక్కు గురయ్యారు. ఐటీ కారిడార్లోని మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, చందానగర్ ప్రాంతాల్లో నిత్యం ఇలాంటి గంభీర ఉల్లంఘనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.
నామమాత్రపు జరిమానాలు..
ఫుడ్ సెప్టీ నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే రూ.50 వేల నుంచి రూ 10 లక్షల వరకు జరిమానా, లైసెన్స్ రద్దు లేదా క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. కానీ, సైబరాబాద్ పరిధిలో అధికారులు కేవలం రూ.5 వేల నుంచి రూ.25 వేల లోపు నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు. దీంతో హోటల్ యాజమాన్యాలు ఈ జరిమానాను కేవలం ఒక ‘వ్యాపార ఖర్చు’గా భావిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం నోటీసులు, హెచ్చరికలు ఇచ్చి వదిలేస్తుండటంతో కల్తీ రాయుళ్లకు చట్టం పట్ల భయం లేకుండా పోయింది.వందలాది చిన్న, మధ్య తరహా హోటళ్లు కనీస అనుమతులు లేకుండానే నడుస్తున్నాయి. లైసెన్స్ లేకపోతే రూ.2 లక్షల వరకు జరిమానా విధించే వీలున్నా, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇవి ఇష్టారాజ్యంగా వ్యాపారం సాగిస్తున్నాయి.
అయోమయంలో రేటింగ్లు.. ప్రమాదంలో ప్రజారోగ్యం..
ఇటీవల అధికారులు హోటళ్లకు ‘హైజీన్ స్కోరింగ్’ (శుభ్రత రేటింగ్) విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఏ స్కోర్ ఎంతవరకు సురక్షితం? తక్కువ స్కోర్ వచ్చిన హోటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనే విషయాలపై స్పష్టత లేకపోవడంతో ప్రజలు అయోమయంలో పడుతున్నారు.
మరోవైపు, నిల్వ ఉంచిన మాంసం, సింథటిక్ రంగుల వల్ల ప్రజలు నిత్యం ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రిక్ సమస్యల బారిన పడుతున్నారు.ఉల్లంఘనల తో తీవ్ర ఆరోగ్య ముప్పుపొంచి ఉంది.కుళ్లిన మాంసం తినడం తో తీవ్ర ఫుడ్ పాయిజనింగ్,కృత్రిమ రంగులు వల్ల క్యాన్సర్, జీర్ణకోశ వ్యాధులుమళ్లీ వాడిన నూనెగుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఆహార భద్రత అంటే కేవలం ఫొటోలు, తనిఖీల హడావుడి కాదు; కఠినమైన చర్యలు, భారీ జరిమానాలు అమలు కావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తినే ఆహారం నమ్మలేకున్నాం..
వారాం తపు రోజుల్లో కుటుంబంతో బయట భోజ నం చేయడం మా అలవా టు. కానీ ఈ తనిఖీ వీడియోలు చూ స్తుంటే ఇక ఏ హోటల్‌కు వెళ్లాలో అర్థం కావడం లేదు. హోటళ్లు, రెస్టారెంట్లపై విశ్వాసం సన్నగిల్లుతోంది, పిల్లల ఆరోగ్యం గురించి భయం వేస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహారించాలి.
బజార్ ఘాట్ రమేష్, ప్రెసిడెంట్, జీహెచ్‌ఎంసీ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్






