బార్దాన్‌కు భలే గిరాకీ..!
రూ.27లకు పాత గన్నీ సంచి
మక్క రైతులకు మద్దతివ్వని మార్క్‌ఫెడ్
మహబూబాబాద్, మే 5 (విజయక్రాంతి): యాసంగి సీజన్లో రైతులు పండించిన మొక్కజొన్నలకు ప్రైవేటు ట్రేడర్లు మద్దతు ధర ఇవ్వకపోవడంతో, ప్రభుత్వం మొక్కలు పండించిన రైతులకు మద్దతు ధర ఇచ్చి మక్కలు కొనుగోలు చేయడానికి రంగంలోకి దించిన మార్క్ఫెడ్ సంస్థ వ్యవహారం ఒక చేత్తో ఇచ్చి.. మరో చేతితో లాగేసుకున్న ఈదుగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రైవేటు ట్రేడర్లు మక్కలకు గరిష్టంగా క్వింటాలకు 1,900 మాత్రమే ధర పెడుతుండడంతో, ప్రభుత్వం మార్క్ ఫెడ్ సంస్థ ద్వారా క్వింటాలుకు 2,400 రూపాయల ధర చెల్లించే విధంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 21చోట్ల మక్కల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇప్పటి వరకు 8,196 మంది రైతుల నుంచి 41,167.750 మెట్రిక్ టన్నుల 8,23,355 బస్తాల మొక్కజొన్నలను సేకరించింది. మొదట్లో మార్క్ ఫెడ్ సంస్థే రైతులకు గన్నీ సంచులను అందించగా, తరువాత గన్నీ సంచుల కొరత ఉందని, రైతులే గన్నీ సంచులను తెచ్చుకోవాలని సూచించింది.
రైతులు సమకూర్చుకున్న గన్నీ సంచులకు ఒక్కంటికి 21 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. దీనితో గన్నీ కొరతతో రోజుల తరబడి నిరీక్షించలేక రైతులు బయట 25 రూపాయల చొప్పున గన్ని సంచులను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. దీనితో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గన్నీ సంచులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా పాత గన్నీ సంచుల వ్యాపారులు రోజుకు కొంత చొప్పున గన్ని సంచుల ధరను పెంచుతూ ప్రస్తుతం 27 రూపాయలకు విక్రయిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిన్న మొన్నటి వరకు కొత్త గన్నీ సంచి 30 రూపాయలకు లభించగా, ఇప్పుడు పాత గన్ని సంచి ధర 27 గమనార్హం. ఒక్కో క్వింటా మక్కలు విక్రయించడానికి అదనంగా రైతులు రెండు గన్నీ సంచులను వినియోగించాల్సి వస్తుండడంతో మార్క్ఫెడ్ 42 రూపాయలు ఇస్తుండగా, రైతులు అదనంగా 12 రూపాయలు జేబు నుండి భరించాల్సి వస్తోంది.
ఇదే కాకుండా హమాలీ, కూలీ, దాడువాయి, సుతిలి, నెంబర్ వేయడానికి క్వింటాలకు 100 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోందని, దీనివల్ల మార్క్ఫెడ్ ఇచ్చే మద్దతు ధరలో 100 రూపాయలకు పైగా ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఖాళీ గన్ని సంచులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని, రోజువారీగా ఖాళీ గన్ని సంచులను లారీల ద్వారా తెప్పించగానే అలా స్టాక్ అయిపోతోందని, రైతుల డిమాండ్కు తగ్గట్టుగా గన్ని సంచులు దొరకడం లేదని, దీనితో రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన గన్నీ సంచులను ప్రభుత్వమే అందుబాటులో ఉంచాలని రైతులు కోరుతున్నారు.






