10 March, 2026 | 2:53 AM

రాలుతోంది పూత.. ఆందోళనలో అన్నదాత

10-03-2026 12:00 AM

వాతావరణంలో మార్పులతో నేల రాలుతున్న మామిడి పూత

చెట్లవైపు చూస్తూ దీనస్థితికి చేరుతున్న రైతన్న

నష్టశాతం తగ్గేలా సూచనలు చేయాలని వేడుకోలు

తుంగతుర్తి, మార్చి 9: భూమి తల్లిని నమ్మిన రైతు తనకు ఉన్న నీటి వనరు ఆసరాగా చేసుకుని వివిధ రకాల పంటలను సాగుచేస్తాడు. అయితే దీనిలో భాగంగానే పలువురు రైతులు ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. వీటిలో ఉమ్మడి జిల్లాలో ప్రధానమైనవి  మామిడి తోటలు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 27,900 ఎకరాల మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో సూర్యాపేట జిల్లాలో 11,600 ఎకరాలు, నల్లగొండలో 2,300, యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 14,000 ఎకరాల మామిడి తోటలు సాగులో ఉన్నాయి.

అయితే ఈ మామిడి తోటలు ఈ సంవత్సరం జనవరి మాసం నుంచి పూత పూయడం ప్రారంభించాటి. కానీ ఫిబ్రవరి నెల మొదటి వారం వరకు చెట్లకు పూత భారీగా పూసింది. అది చూసిన మామిడి రైతులలో ఆనందాలు కనిపించాయి. కానీ ఫిబ్రవరి మాసంలో వచ్చిన దట్టమైన పొగ మంచు తోపాటు, నల్లతామర పురుగు, తేనెమంచి పురుగు, వివిధ రకాల సమస్యల వల్ల పూత పెద్ద మొత్తంలో రాలుతుంది.                  

పూత రాలడంతో ఆందోళనలో రైతు

ప్రస్తుతం మామిడి తోటలో ఎటు చూసిన పూత నల్లబడి నేల రాలుతోంది. ఎన్ని మందులు పిచికారి చేసిన పూతరాలడం మాత్రం ఆగడం లేదంటూ మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలోనే దాదాపు 4425 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. పూత విపరీతంగా రాలుతుండడంతో ఈసారి కాపు తగ్గే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. 

పెరిగిన పెట్టుబడి తగ్గనున్న దిగుబడి.. 

నియోజకవర్గంలోని నూతనకల్, తుంగతుర్తి మండలాల్లో ఎక్కువగా మామిడి తోటలు ఉన్నాయి.  వీటిలో పూత ఎక్కువగా రాలుతుండడంతో ఒక్కొక్క మామిడి రైతు ఇప్పటికే మూడు నుంచి ఐదు సార్లు వివిధ రకాల కెమికల్స్ ను స్ప్రే చేశారు. ఒక ఎకరానికి కెమికల్స్ స్ప్రే చేయడానికి  ఒకసారికి రూ.2500 _ రూ.3000 వరకు ఖర్చు వస్తుంది. ఇలా అడుగు మందులు పురుగుమందులు లక్షల్లో ఖర్చులు పెట్టి మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఎన్ని లక్షల ఖర్చుపెట్టిన మామిడి చెట్లపై మామిడి పిందెలు కనపడకపోవడంతో మామిడి రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈసారి ఉగాది పచ్చడికి మామిడి కాయలు దొరకక పచ్చడి ఖరీదు బాగా పెరగనున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రతి వేసవిలో దొరికే మామిడిపండ్లు ఈసారికి అంత చౌకగా దొరకకపోతుండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ సీజన్ లో మామిడికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండవచ్చనే సంకేతాలు వస్తున్నాయి.  కాగా అధికారులు, శాస్త్రవేత్తలు తోటలను పరిశీలించి పూత, పిందె రాలకుండా తగు సూచనలు, సలహాలు ఇచ్చి జరుగుతున్న నష్ట శాతాన్ని తగ్గించాలని మామిడి సాగు చేస్తున్న రైతులు కోరుతున్నారు.

తగిన మందులు పిచికారి చేసుకోవాలి

మామిడిలో పూతరాలడం అనేది నల్ల తామర పురుగు, తేనెమంచు పురుగు, మంచు కురవడం వల్ల సాధారణంగా సంభవిస్తుంది. అదేవిధంగా పూత నుండి కింద పడే సమయానికి పదేండ్ల వయస్సు గల ఒక్కో చెట్టు రోజుకి 70_ 100 లీటర్ల నీరు అవసరం అవుతుంది. ఇవి అందించక పోయినా పిందె పసుపు రంగులోకి మారి రాలిపోతుంది. కారణం ఏది అనేది రైతు గుర్తించగలిగితే మంచిది. ఇక పూత రాలకుండా ఉండాలంటే పిప్రోనిల్ 5 ఈసీ 2 మి.లీలు లీటర్ నీటికి లేదా ఎసిటామిప్రిడ్ 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే కాయ రాలకుండా ఉండాలన్న, కాపు నాణ్యతతో రావాలన్న 13-0-45 ను 10 గ్రాములు లీటర్ నీటికి, ఫార్ములా_ 4 ను 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

- సీహెచ్ నరేష్, ఉద్యాన శాస్త్రవేత్త, కెవికె గడ్డిపల్లి

పూత అంతా రాలి కౌలు కట్టే పరిస్థితి లేదు

నేను 70 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకొని, లక్షల రూపాయల్లో అడుగు మందులు, పురుగుమందులు పిచికారి చేశాను. నెల రోజుల క్రితం పూత బాగా రావడంతో సంతోషించాను. కానీ  ఫిబ్రవరి మాసంలో  వాతావరణం మార్పులు, తేనెమంచు పురుగు కారణం చేత పూత మొత్తం నల్లబడి రాలిపోయింది. సుమారు 5 లక్షలకు పైగా అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాను. కౌలు కట్టే పరిస్థితి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.

- సుధాకర్, కౌలు రైతు, గొట్టిపర్తి

మామిడి చెట్లే  నా జీవనాధారం

పది ఎకరాలలో మామిడి తోట వేసి 25 సంవత్సరాలు అయింది. కానీ గతంలో ఈ విధంగా పూత రాలిపోవడం జరగలేదు. జోరుగా పూసిన పూత నేల రాలింది. మామిడి చెట్లే ఆధారంగా జీవనం సాగిస్తున్నాను. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారులు తగిన సూచనలు చేయాలి. 

- పోతరాజు వీరయ్య మాలిపురం గ్రామం, తిరుమలగిరి మండలం, మామిడి రైతు.