వడ దెబ్బతో వ్యక్తి మృతి
మఠంపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ వడదెబ్బ మరొకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. మఠంపల్లి మండల పరిధిలోని యాతవాకిళ్ళ గ్రామానికి చెందిన గుజ్జుల వెంకట్ రెడ్డి (52) గ్రామంలో వివిధ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. సోమవారం పని నిమిత్తం బయటికి వెళ్లే క్రమంలో వడదెబ్బకు గురై అమరవరం - యాతవాకిళ్ళ రహదారిపై స్పృహ తప్పి కుప్ప కూలిపోయాడు.
గమనించిన స్థానికులు వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు ప్రభావంతోనే వెంకటరెడ్డికు వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని ప్రభుత్వానికి గ్రామస్తులు కోరారు. మండలంలో షరోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.






