నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ చోరీ
రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఇంట్లో భారీ నగల చోరి
ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు
సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు
కామారెడ్డి,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 30 తులాల విలువ చేసే బంగారు నగలను, ఇతర వస్తువులను దుండగులు చోరీ చేశారు. నిజామాబాద్ సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవి కుమార్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్లారు.
ఇదే అదనుగా భావించిన గుర్తు తెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 30 తులాల నగలు, ఇతర వస్తు సామాగ్రిని ఎత్తుకెళ్లారు. విషయాన్ని తెలుసుకున్న రవికుమార్ నిజామాబాద్ కు మంగళవారం వచ్చి ఇంట్లో జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో బీరువాలో ఉన్న 30 తులాల బంగారు నగల తో పాటు ఇతర వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు మూడవ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ముగ్గురు గుర్తుతెలియని దుండగులు బైక్ పై వచ్చి చోరీకి పాల్పడి వెళ్లినట్లు సీసీ కెమెరాల ఫుటేజీలలో నమోదైనట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కు సంబంధించిన డి డి ఆర్ ను కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ భారీ చోరీ ఘటన కలకలం లేపుతుంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.






