జడ్పీఎస్ఎస్ అభివృద్ధికి విరాళం అందజేసిన మాజీ మంత్రి
బేల, (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధికి మాజీ మంత్రి జోగు రామన్న లక్ష రూపాయల విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ విద్యార్థులంతా క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. పదో తరగతిలో 550 మార్కులు సాధించే ప్రతి విద్యార్థికి రూ. 5 వేల చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తానని ప్రకటించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు, పూర్వ విద్యార్థులు, ప్రజలు ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రౌత్ మనోహర్, మాజీ సర్పంచ్ దేవన్న, తేజ్‌రావ్, ఆడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, విపిన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






