28 February, 2026 | 6:14 PM

నార్కట్‌పల్లిలో మెడికల్‌షాప్‌లోకి దూసుకెళ్లిన లారీ

28-02-2026 01:22 AM

ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశం

ప్రమాద స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

చిట్యాల, ఫిబ్రవరి 27: నార్కట్పల్లి పట్టణ పరిధిలోని నల్లగొండ చౌరస్తా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బండల లారీ వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న మెడికల్ షాప్ లోకి గురువారం రాత్రి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మేడి కృష్ణ మృతిచెందగా, లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుక్రవారం  ప్రమాద స్థలాన్ని ప్రత్యక్షంగా సందర్శించి పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారుల ద్వారా తెలుసుకుని, సీసీ కెమెరా ఫుటేజీలు తదితర అంశాలపై సమగ్ర విచారణ చేయాలని ఆదేశించారు. ఎస్పీ  ఘటన స్థలంలో ఉన్న రోడ్డు నిర్మాణం, ట్రాఫిక్ నియంత్రణ పరిస్థితులు, హెచ్చరిక బోర్డుల లేమి తదితర అంశాలను పరిశీలించి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత రోడ్డు సేఫ్టీ అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ముఖ్యంగా జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, హెచ్చరిక బోర్డులు పెంచడం, రాత్రి వేళల్లో మెరుగైన లైటింగ్ ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ సిబ్బంది పర్యవేక్షణ పెంచడం వంటి చర్యలను తక్షణం అమలు చేయాలని ఆర్&బి అదికారులను ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన  కుటుంబ సభ్యులకు ఎస్పీ  ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని, రాత్రి వేళల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ నల్లగొండ శివరాం రెడ్డి, ఎస్.ఐ విష్ణు, స్థానిక సర్పంచ్ భరత్ ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.