15 April, 2026 | 4:33 AM

ఆసుపత్రిలో గదులకు తాళాలు

15-04-2026 12:17 AM
  1. అధికారులు ఎప్పుడు వస్తున్నారో..ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితి...
  2. సమయపాలన పాటించని హెచ్‌ఈఓ... 

తాడ్వాయి, ఏప్రిల్, 14( విజయ క్రాంతి): గ్రామాల్లోని నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది.ఈ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని లక్ష్యం పెట్టుకుని అవసరమైన మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రులు తెరుచుకొని ఉండాలి.

అందరూ వైద్యాధికారులు అందుబాటులో ఉండాలి. ఆసుపత్రికి వచ్చిన పేద ప్రజలకు చికిత్సలు అందించి అందుకు అవసరమైన మందులు అందించాలి. కానీ అధికారుల తీరు భిన్నంగా ఉంది. అడిగే వారు ఎవరన్నా ధీమాతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  మూడు గంటలకే అధికారులు ఆస్పత్రి నుంచి వెళ్ళిపోతున్నారు. కొన్ని సందర్భాలలో మధ్యాహ్నం 2:30 గంటలకే ఆసుపత్రిలో అధికారులు ఉండడం లేదు. 

ఆసుపత్రిలో సూపర్వైజర్ మణెమ్మ, ఎఎన్‌ఎమ్ సుమలత, మరో ఏఎన్‌ఎం లు మాత్రమే ఉన్నారు. ఆసుపత్రిలో పూర్తిస్థాయి బాధ్యత గల అధికారులు ఆసుపత్రి సమయం పూర్తి అయ్యేవరకు వరకు అక్కడే ఉండి విధులు నిర్వహించాలి. కానీ ఆస్పత్రిలో పూర్తిస్థాయి బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన హెచ్‌ఈఓ నారాయణ కుర్చీ ఖాళీగా ఉంది.

ఆయన ఆసుపత్రికి ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ప్రతిరోజు సక్రమంగా విధులు నిర్వహించాల్సిన హెచ్ ఈ ఓ తన ఇష్టానుసారం విధులకు హాజరవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.విజయ క్రాంతి ఆసుపత్రిని సందర్శించగా ఆసుపత్రిలో చాలా గదులు తాళాలు వేసి దర్శనమిచ్చాయి.

మధ్యాహ్నం మూడు గంటలకే ఖాళీగా ఉన్న కుర్చీలు..

మధ్యాహ్నం మూడు గంటలకే కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. హెచ్ ఓ నారాయణ తన గదిలో లేరు. కుర్చీ ఖాళీగా ఉంది. ఆయన ఎక్కడ వెళ్లారు అని సిబ్బందిని అడగగా ఆయన సెలవులో ఉన్నారని తెలిపారు. సెలవు పత్రం ఏమైనా ఉందా అని అడగగా తమకు తెలియదని దాటవేశారు. కంటి పరీక్షల గదికి తాళం వేసి ఉంది.యూసిడి గదికి తాళం వేసి ఉంది. అక్కడ యుసిడి వీధుల్లో లేరు.

యు సి డి సైతం ఆసుపత్రికి ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో తెలియని పరిస్థితితులు నెలకొన్నాయి.   వైద్యాధికారి కుర్చీ ఖాళీగా ఉంది. వైద్యాధికారి లేరా అని కోరగా చిట్యాలకు శిబిరానికి వెళ్లారని సమాధానం చెప్పారు. కానీ చిట్యాల లో వైద్య శిబిరం ఉందా లేదా అని తెలుసుకోగా ఎలాంటి శిబిరం లేదని తెలిసింది.

హోమియోపతి వైద్యశాలకు తాళం 

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే హోమియోపతి వైద్యశాల ఉంది.ఇక్కడ వైద్యాధికారి తో పాటు ఒక కాంపౌండర్, ఒక స్వీపర్ విదులు నిర్వహిస్తున్నారు. . మూడు గంటలకే హోమియోపతి వైద్యశాలకు తాళం వేసి ఉంది.వైద్యాధికారి, సిబ్బంది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. కొన్ని సందర్భాలలో హోమియో పతి వైద్యశాల రెండు గంటలకే తాళం వేసి వెళ్ళిపోతున్నారని ప్రజలు తెలుపుతున్నారు.

హెచ్ ఈ ఓ హైదరాబాద్ నుంచి ప్రయాణం..

ఎర్రపహాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఎచ్ ఈ వో హైదరాబాద్ నుంచి ఎర్రపహాడ్ ఆసుపత్రికి ప్రయాణం చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఆసుపత్రికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధ్యతగా విధులు నిర్వహించాల్సిన అధికారి,బాధ్యతగా విధులు నిర్వహించడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చుట్టం చూపుల వచ్చి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆయన ఆసుపత్రికి ఇలా వచ్చి టూర్ లో వెళ్లినట్లు అలా వెళ్ళిపోతున్నారని ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కచ్చితంగా అధికారులు రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.