09-02-2026 12:00:00 AM
కారుచీకటి గర్భాన్ని
చీల్చుకుంటూ
ఉదయించిన ఆకాశం
సాక్షిగా
కలల వాకిట నిలిచిన
ఒక పసివాడి చూపు అది !
ఆకలి తీరని విపణి
వీధుల్లో
బతుకు బరువుతో
చిక్కుకున్న వేళ
ముక్కుపచ్చలారని
ముఖంపై
మురిపెం మెల్లగా
మాయమైంది !
ఎముకలు కొరుకు
చలి వణికిస్తున్నా
గుండెల్లో మాత్రం
ఆరిపోని ఒక దీపం
అక్షర స్వప్నం!
ఎదురుచూపుల
భారంతోసూరీడు
అస్తమించబోయే వేళ
కన్నీటి సంద్రంలో
ఆశలే ఒడిసిపట్టిన
పడవలు
అన్యాయపు రెక్కలు విరిచిన
కాకుల్లేని ఆకాశం కావాలి !
కల్మషం చెరిగిన లోకంలో
స్వేచ్ఛగా గగన
విహారం చేయాలి
పుస్తకమే ఆయుధమై
చదువే దారిగా మారి
చీకటిని అక్షరాలు
చెరిపివేసే రోజున
ప్రతి బాల్యం
ఒక కొత్త చరిత్రను
లిఖించాలి!
ఎల్ ఎన్ కొల్లి