calender_icon.png 14 February, 2026 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేబర్ కోడ్లను రద్దు చేయాలి

13-02-2026 12:00:00 AM

ఏఐటీయూసీ డిమాండ్

కందుకూరు, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కందుకూరులో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సార్వత్రిక సమ్మె సందర్భంగా ఏఐటీయూసీ (AITUC) జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మగళ్ళ రాజు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కార్మికులు ఏళ్ల తరబడి పోరా డి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి, కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు.

కొత్త చట్టాల పేరుతో కార్పొరేట్ శక్తులు కార్మికులను బానిసలుగా మారుస్తున్నాయని, వేత నాలు చెల్లించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నాయని రాజు ఆరోపించారు.1948 ఫ్యాక్టరీ చట్టం ద్వారా వచ్చిన 8 గంటల పని విధానాన్ని, ఇతర కార్మిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉండి ఈ దోపిడీని అడ్డుకోవాలని, సార్వత్రిక సమ్మె ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాదగిరి, రవి, శ్రీను, జంగయ్య తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.

లేబర్ కోడ్ల రద్దుకు డిమాండ్

షాద్‌నగర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా షాద్నగర్లో  నిరసన జ్వాలలు మిన్నంటాయి. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం మరియు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు కార్మికులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేపట్టి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ర్యాలీని ప్రారంభించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్. రాజు మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ధ్వజమెత్తారు. స్వాతంత్య్రానంతరం ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు పూర్తిగా కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ఉన్నాయని విమర్శించారు.

హైర్ అండ్ ఫైర్’ (కావాలన్నప్పుడు తీసుకోవడం, వద్దనుకున్నప్పుడు తీసేయడం) విధానం వల్ల శాశ్వత ఉద్యోగాలకు కాలం చెల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్ యాక్టివిటీల్లో సైతం కాంట్రాక్ట్ కార్మికులను నియమించుకునే స్వేచ్ఛను యాజమాన్యాలకు కల్పించడం ద్వారా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కార్మిక యూనియన్ల ఏర్పాటు, సమ్మె చేసే హక్కులను కట్టడి చేస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు శీను నాయక్, జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి భుజంగ రెడ్డి, అంగన్వాడి ప్రాజెక్టు అధ్యక్షురాలు జయమ్మ, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్ నాయక్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పవన్, మరియు సీఐటీయూ నాయకులు సాయి బాబు, నర్సింలు పాల్గొన్నారు.

కార్మికుల కష్టాలను తీర్చడానికి.. ఎర్రజెండా నిరంతరం పనిచేస్తుంది 

ఘట్ కేసర్, ఫిబ్రవరి 12(విజయక్రాంతి): కార్మికులకు అండగా వారి కష్టాలను తీర్చడానికి ఎర్రజెండా నిరంతరం పనిచేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వి.ఎస్. బోస్ అన్నారు. ఘట్ కేసర్ లో గురువారం నిర్వహించిన కార్మికుల దేశవ్యాప్త సమ్మె విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు వి.ఎస్. బోస్, కె. జయచంద్ర,

సిఐటియు నాయకులు చింతల యాదయ్య, సిపిఎం మండల కార్యదర్శి నార్కట్ పల్లి సబిత,  సిపిఐ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్ ప్రసంగించారు. ఘట్కేసర్ లో పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమౌళి, అశోక్, చంద్రశేఖర్, అశోక్, ఎల్లమ్మ, మధ్యాహ్న భోజన కార్మికుల కార్యదర్శి కవిత, ఏఐటియుసి మున్సిపల్ వర్కర్ల కార్యదర్శి రామచందర్, మండల ఉపాధ్యక్షురాలు సునీత దేవి ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.