గరం గరంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
సమస్యలను వ్యక్తం చేసిన కౌన్సిలర్లు
కోదాడ: కోదాడ మున్సిపాలిటీ సాధారణ సమావేశం శుక్రవారం గరంగరంగా జరిగినట్లు సమాచారం. కోదాడ పట్టణ పరిధిలో పలు అంశాలపై బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు మామిడి రామారావు చీమ నరేష్ కందుల చంద్రశేఖర్ లతో పాటు ఇండిపెండెంట్ కౌన్సిలర్ డాక్టర్ నాగేశ్వరరావు మరో ఇరువురు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు కమిషనర్ను, అధికారులను నిలదీసినట్టు తెలిసింది. అధికారుల నిర్లక్ష్యంపై పలువురు కౌన్సిలర్లు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ముఖ్యంగా మున్సిపల్ ప్రత్యేక అధికారి పాలన హయాంలో భారీగా అధికారులు అవినీతికి పాల్పడి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు దండుకొనిఔట్సోర్సు ఉద్యోగులను 22వ గ్రూపుగా ఏర్పాటు చేసిన అంశంపై దాదాపు రెండున్నర గంటల పాటు కమిషనర్ కౌన్సిలర్ల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. ఏడుగురు ఉద్యోగులను నియమించారని ఇప్పుడు సదరు గ్రూపులో మృతి చెందిన వారసులను కాక ఇతర వ్యక్తులను ఎలా నియమించారని మండిపడ్డారు.
సదరు గ్రూపుకు జీతాలు నిలిపివేయాలని బిఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు పలువురు అధికార పార్టీ కౌన్సిలర్ కూడా డిమాండ్ చేయటంతో ఆ గ్రూపును పక్కకు పెట్టినట్టు తెలిసింది. గతంలో 26 మందిని, 70 మందిని నియమించి జీతాలు ఇవ్వకుండా పక్కకు పెట్టారని అప్పుడు లేని మానవతా దృక్పథం ఇప్పుడు ఎందుకు చూపాలని బిఆర్ఎస్ కౌన్సిలర్లు ఎదురు సమాధానం చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా పార్కు అభివృద్ధి పనులకు, సిగ్నల్ వ్యవస్థకు వెచ్చించిన వ్యయంపై కూడా చర్చ జరిగినట్టు తెలిసింది.
మున్సిపాలిటీ పరిధిలో ఎస్సీఎస్టీ వార్డులకు సంబంధించి వార్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, సమాచారాన్ని తమకు అందించడం లేదని ఆ వార్డుల కౌన్సిలర్లు సమావేశం అనంతరం స్పష్టం చేశారు. తమ వార్డులకు అధిక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు వైస్ చైర్మన్ మల్లీశ్వరి కమిషనర్ రమాదేవి కౌన్సిలర్లు అధికారులు పాల్గొన్నారు.






