25 February, 2026 | 4:27 AM

ఈఎస్‌ఐ డిస్పెన్సరీలకు మోకాలడ్డు

25-02-2026 01:23 AM

మెడికల్ మాఫియా గుప్పిట ఖమ్మం జిల్లా..

ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులు కట్టలేకపోతున్న వేలాదిమంది చిరుద్యోగులు, కార్మికులు

డిప్యూటీ సీఎంతో సహా ముగ్గురు ముఖ్యమైన మంత్రులున్నా.. ఏమీ చేయలేకపోతున్న వైనం 

జిల్లాకు మూడు డిస్పెన్సరీలు మంజూరైనా ఇప్పటివరకు ప్రారంభించకపోవడంతో రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, హోటళ్లు, సినిమాలు, ప్రైవేటు కంపెనీలు, దుకాణాలు, ఇతర ఫ్యాక్టరీలు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇందులో ఎంతలేదన్నా.. కనీసం 2.5 లక్షల మంది వరకు చిరు ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తూంటారు. వీరందరూ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ (ఈఎస్‌ఐ) కిందకే వస్తారు.

ఉద్యోగులు, కార్మికుల కుటుం బసభ్యులతో కలిపితే సుమారు 10 లక్షల మందికి వైద్య సేవలు అందించాల్సిన ఈఎస్‌ఐ ఎందుకనో ఈ జిల్లాలో సరైన సేవలు అందించలేకపోతుంది. కేవలం ఒక్కటంటే ఒక్కటే డిస్పెన్సరీ (భద్రాచలం దగ్గర సారపాక)తో జిల్లా మొత్తానికి సేవలు అందుతున్నాయా అంటే పెదవి విరుపే సమాధానంగా కనపడుతోంది.

ముగ్గురు మంత్రులున్నా.. 

పేరు గొప్ప.. ఊరు దిబ్బలా తయారయ్యింది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిస్థితి. డిప్యూటీ సీఎంతోపాటు మొత్తం ముగ్గురు ముఖ్యమైన మంత్రులు ఉన్నప్పటికీ.. ఈఎస్‌ఐ సేవలు అందించడంలో మాత్రం అన్ని జిల్లాల కంటే వెనుకబడే ఉంటోంది. సుమారు 10 లక్షల మంది చిరుద్యోగు లకు, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సేవలు అం దించాల్సిన ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ఏర్పాటు విషయంలో ముగ్గురు మంత్రులు ఏ మాత్రం దృష్టి సారించనట్టుగా కనపడటం లేదు.

ఇందుకు ప్రధాన కారణం.. ఇక్కడ ఉన్న కార్మిక, చిరుద్యోగులు భారీగా ఉండటాన్ని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం (కార్మిక శాఖ) అదనంగా ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను మంజూరు చేసినా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేయడం లేదు. దీనితో చాలాకాలం వేచిచూసీ.. మంజూరు చేసిన డిస్పెన్సరీలను సైతం కేంద్రం రద్దు చేసింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులపై కార్మికులు, చిరుద్యోగులు భగ్గుమంటున్నారు.

గతంలో మూడు.. తాజాగా ఒకటి..

ఖమ్మం జిల్లాలో ఉన్న కార్మిక లోకాన్ని, చిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం సుమారు దశాబ్దం క్రితం (2018కి ముందు) మూడు ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను మంజూరు చేసింది. అయితే అప్పటి ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టకపోవడంతో ఆ మూడింటినీ కేంద్రం రద్దు చేసింది. 2018లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15 డిస్పెన్సరీల ఏర్పాటులో భాగంగా.. ముదిగొండలోనూ ఈఎస్‌ఐ డిస్పెన్సరీని కేంద్రం మంజూరు చేసింది.

అయితే షరా మామూలుగా.. ఈ 15 డిస్పెన్సరీల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్థల సేకరణ, భవన నిర్మాణం, సిబ్బందిని నియామకం లాంటివి చేయకపోవడంతో.. ఈ డిస్పెన్సరీల ఏర్పాటు అటకెక్కింది. దీనిపై అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తాఖీదులు పంపించిన కేంద్రం..

ఈ ఏడాది జనవరిలో సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. 15 రోజుల్లో డిస్పెన్సరీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ అల్టిమేటం ఇచ్చింది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. దీనితో 2018లో మంజూరుచేసిన 15 డిస్పెన్సరీలను రద్దుచేస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 డిస్పెన్సరీలను రద్దయ్యాయి. వాటిటో.. ఖమ్మం జిల్లాలోని ముదిగొండలోని డిస్పెన్సరీకూడా ఉండటంతో ఖమ్మంలోని కార్మికవర్గాలు మండిపడుతున్నాయి. హైదరాబాద్ నగరం తరువాత అత్యధిక మంది కార్మికులు, చిరుద్యోగులు ఉన్న పట్టణాల్లో ఖమ్మం కూడా ఉంది. ఈ నేపథ్యంలో గతంలోనే మూడు మంజూరైనా అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేయకపోవడం..

తాజాగా ముదిగొండలోనూ ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటుపై జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకే ఆసక్తి లేకపోవడాన్ని ఇక్కడ కార్మిక వర్గాలు ఎత్తిచూపుతున్నాయి. స్థల సేకరణ, భవన నిర్మాణం, ఉద్యోగులను కేటయిస్తే.. వేలాదిమంది కార్మికులు.. వారి కుటుంబ సభ్యులతో కలుపుకుంటే.. లక్షలాది మందికి విస్తృతమైన సేవలు అందించే సదుపాయాన్ని మంత్రులు పట్టించుకోకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఎప్పుడో సారపాకలో ఏర్పాటుచేసిన ఒక డిస్పెన్సరీ ఉంది. అలాగే గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు బ్రాంచ్ ఆఫీసుగా పిలుచుకునే లోకల్ ఆఫీసు (ఖమ్మంలోని రాపర్తినగర్) మాత్రమే ఈఎస్‌ఐ పరిధిలో ఉన్నాయి. ఇందులోనూ డిస్పెన్సరీలో మాత్రమే వైద్యులు, సిబ్బంది, మందులు ఉంటాయి. ఇక లోకల్ ఆఫీసు (బ్రాంచ్ ఆఫీసు)లో ఎలాంటి వైద్య సేవలు అందవు.. మందులు అందుబాటులో ఉండవు.

కొండొకచో.. వైద్యుడు వచ్చి చూసి వెళుతుంటారు. అంతకుమించి అక్కడ అందే వైద్య సేవలు ప్రత్యేకంగా ఏమీ ఉండవు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం లాంటి చోట భారీగా ఉన్న కార్మికులు, చిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని కేంద్రం డిస్పెన్సరీలను మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వైఖరితో అవికూడా రద్దు కావడంతో.. జిల్లా నాయకత్వంపై సర్వత్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

డిస్పెన్సరీ ఏర్పాటు అనేది చిన్న అంశంగా బయటకు కనపడుతుందని, ఒకవేళ డిస్పెన్సరీని ఏర్పాటుచేస్తే.. ఖమ్మం జిల్లాలోని వేలాది మంది కార్మికులు, చిరుద్యోగులు, వారి కుటుంబాలతో కలిపి సుమారు 10 లక్షల మంది వరకు ప్రైవేటు ఆసుపత్రులకు దూరం అవుతారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఒక్క పైసా లేకుండా చికిత్సలు అందిస్తారు. ఒకవేళ వ్యాధి తీవ్రతను బట్టి.. హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐ వైద్య కళాశాలకు, ఆసుపత్రికి రిఫర్ చేస్తారు.

దీనివల్ల ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగులు తగ్గిపోయి.. రూ. కోట్లు నష్టపోతామనే ఉద్దేశంతోనే మెడికల్ మాఫియా చాపకింద నీరులా ప్రభుత్వ పెద్దలను ప్రభావితం చేసి డిస్పెన్సరీని ఏర్పాటు చేయకుండా అడ్డుకుందని గట్టిగా అనుమానిస్తున్నారు. అయితే కార్మికులు, చిరుద్యోగుల దృష్టిలో.. ప్రస్తుతం ఏచిన్న వైద్య సేవలు అందాలన్నా.. ప్రైవేటు ఆసుపత్రులనే ఆశ్రయించాల్సి వస్తోంది. దీనికి రూ. వేలల్లో ఖర్చువుతోంది.

అదే ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఏర్పాటుచేస్తే.. పూర్తి ఉచితంగానే వైద్యసేవలు, మందులు, డ్రగ్స్ అందుతాయని వారంటున్నారు. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల ద్వారా ఉచితంగా వచ్చే వైద్యసేవలు అందకుండా అడ్డుకున్న మెడికల్ మాఫియాపై, అచేతనంగా ఉన్న ముగ్గురు మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.   

తెరవెనుక మెడికల్ మాఫియా.. 

కార్మికులు, చిరుద్యోగులు భారీ సంఖ్యలో ఉండటంతో.. ఖమ్మం పట్టణంలో ప్రతి గ ల్లీకి ఒక ప్రైవేటు ఆసుపత్రి కనిపిస్తుంది. అలాగే జిల్లా వ్యాప్తంగాకూడా భారీగా ప్రైవేటు ఆసుపత్రులు ఎప్పుడూ రోగులతో కిటకిటలాడుతూ కనపడుతుంటాయి. వాస్తవానికి ఇక్కడికి వచ్చేవారిలో 50 శాతం కంటే ఎక్కువ మంది రోగులు కార్మికులు, చిరుద్యోగులు, చిరువ్యాపారులు, వారి కుటుంబ సభ్యులే ఉంటారు. అంటే వీరందరూ ఈఎస్‌ఐ పరిధిలోకి వస్తారన్నమాట.

తాజాగా ముదిగొండలో మంజూరుచేసిన డిస్పెన్సరీని కూడా రద్దు చేయడంతో.. ఈ ప్రభావం కార్మికులపైనే ఎక్కువగా పడుతుందని వారంటున్నారు. అయితే మంజూరైన డిస్పెన్సరీలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతుందనే అనుమానాలు వీరిని తొలుస్తున్నాయి. పరిస్థితి చూస్తే.. ఈఎస్‌ఐ డిస్పెన్సరీ ఏర్పాటు అయితే.. ప్రైవేటు ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గి..

ప్రైవేటు ఆసుపత్రుల వ్యాపారం దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలోనే మెడికల్ మాఫియా ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చి.. డిస్పెన్సరీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం విముఖత చూపించి ఉంటుందని కార్మిక వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. అందుకే ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ.. మంజూరైన డిస్పెన్సరీ ఏర్పాటుపై దృష్టి పెట్టలేదంటూ వాపోతున్నారు.