14 June, 2026 | 2:27 AM

ఖమ్మం ఘటన.. నిందితుడిని ఉరి తీయాలి

14-06-2026 01:05 AM
  1. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
  2. కేసు వాపసు.. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి అమానుషం
  3. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): ఖమ్మంలో మైనర్‌పై లైంగికదాడి ఘటనలో నిందితుడిని ఉరి తీయాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాం డ్ చేశారు. 12 ఏళ్ల బాలికపై లైంగికదాడితో పాటు ఆమెను భవంతిపై నుంచి తోసేయటంతో జీవితాంతం నడవలేని పరిస్థితి ఏర్ప డిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలిని శనివారం కవిత పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి.. ఆమెకు అందిస్తున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి తల్లిదండ్రులను ఓదా ర్చి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.

అత్యంత అమానుషమైన దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని ఉరి తీయాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో ప్రభుత్వ పెద్దలే కేసు వాపసు తీసుకోవాలంటూ బాధితురాలి కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని, ఇది చాలా అమానుషమని కవిత మండిపడ్డారు. ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలన్నారు. బాధితురాలి తల్లితండ్రులు ఇద్దరు కూడా కూలీలేనని వారికి అంత ఆర్థిక స్థోమత లేదని కవిత చెప్పారు. ప్రభుత్వమే ఆ కుటుంబానికి అండగా నిలవాలన్నారు. వారికి ఇళ్లు కేటాయించటంతో పాటు ప్రతినెల రూ. 50 వేలు పెన్షన్ వచ్చే లా చర్యలు తీసుకోవాలని కోరారు.  ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలని కవిత సూచించారు. రాష్ట్రం లో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత లేని పరిస్థితి వచ్చినా ఈ ప్రభుత్వంలో చలనం లేదని సీఎం ఇకనైనా స్పందించి ఆడపిల్లల భద్రతకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.