10 May, 2026 | 1:04 AM

రైలు పట్టాల భద్రతకు కీమెన్లు

10-05-2026 12:16 AM

దేశ రైల్వే వ్యవస్థలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం వెనుక కనిపించని ఎన్నో చేతులు పనిచేస్తుంటాయి. అందులో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించే సిబ్బందిలో ‘రైల్వే కీమెన్’ ముఖ్యులు. మండుటెండలు, కురిసే వానలు, చీకటి రాత్రులు, అడవి ప్రాంతాలు, జనసంచారం లేని మార్గాలు, ఇలా ఎలాంటి పరిస్థితులైనా పట్టాల భద్రతే తమ ధ్యేయంగా వీరు పని చేస్తుంటారు. రైల్వే పట్టాల ఆరోగ్యాన్ని కాపాడే మొదటి భద్రతా సిబ్బందిగా ‘కీ’మెన్లను పరిగణిస్తారు.

కీమెన్ అంటే ఎవరు?

రైల్వే ట్రాక్లను నిరంతరం పరిశీలిస్తూ, ఎక్కడైనా లోపాలు, పగుళ్లు, ఫిషపేట్ల సడలింపులు, ట్రాక్ వంకరలు, జాయింట్ల సమస్యలు, ప్రమాద సూచనలు ఉన్నాయా అనే అంశాలను తనిఖీ చేసే ట్రాక్ మెయింటెనెన్స్ సిబ్బందినే ‘కీ’మెన్ ప్రస్తుతం ‘ట్రాక్ మెన్’ అంటారు. వీరు సాధారణంగా ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తారు.

రోజువారీ విధులు ఇలా..

కీమెన్ పని తెల్లవారుజామునే ప్రారంభమవుతుంది. వారికి కేటాయించిన ట్రాక్ పరిధిని కాలినడకన పరిశీలించాలి. ఒక్కో కీమెన్‌కు కొన్ని కిలోమీటర్ల ట్రాక్ బాధ్యతగా ఉంటుంది. వారి ప్రధాన విధుల్లో రైల్వే పట్టాల పరిశీలన, ఫిష్‌పేట్లు, బోల్టులు, నట్స్ బిగుతు తనిఖీ, ట్రాక్ గ్యాప్‌ల పరిశీలన, పగుళ్లు, వంకరలు గుర్తించడం, స్లీపర్లు దెబ్బతిన్నాయా చూడటం, వర్షాకాలంలో ట్రాక్ కింద మట్టి జారుడును పరిశీలించడం, ట్రాక్‌పై చెట్లు, రాళ్లు, అవరోధాలు తొలగించడం, ప్రమాద సూచనలు గమనిస్తే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, అవసరమైతే రైలును నిలిపివేసేందుకు ఎర్రజెండా, డెటోనేటర్లు వినియోగించడం వంటి బాధ్యతలు ఉంటాయి.

నిత్యం వెంట తీసుకెళ్లాల్సిన సామగ్రి

కీమెన్ తన విధుల్లో భాగంగా నిత్యం కొన్ని కీలక వస్తువులను వెంట తీసుకెళ్లాలి. ఇవి భద్రత పరంగా అత్యంత అవసరం. ట్రాక్ కీ బ్యాగ్, స్పానర్, ట్రాక్ హ్యామర్, జెండాలు (ఎరుపు, ఆకుపచ్చ), డెటోనేటర్లు (ప్రమాద హెచ్చరిక పేలుడు క్యాప్స్), హ్యాండ్ సిగ్నల్ ల్యాంప్, విజిల్, రిజిస్టర్ లేదా నోట్బుక్, మొబైల్ ఫోన్ లేదా వాకీటాకీ, టార్చ్ లైట్, సేఫ్టీ జాకెట్, రైన్కోట్ (వర్షాకాలంలో), తాగునీటి సీసా, ప్రథమ చికిత్స కిట్.

ప్రమాదాల మధ్య విధులు

కీమెన్ విధులు ఎంతో కష్టసాధ్యమైనవి. రోజుకు అనేక కిలోమీటర్లు రైలు పట్టాలపై నడవాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అడవి జంతువుల భయం, విషసర్పాల ప్రమాదం కూడా ఉంటుంది. ట్రాక్ తనిఖీ చేస్తున్న సమయంలోనే రైళ్లు వేగంగా దూసుకెళ్తుండటంతో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. వర్షాకాలంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. వరదలు, మట్టి జారుడు, ట్రాక్ దిగజారుడు వంటి సమస్యలను ముందుగానే గుర్తించకపోతే పెద్ద ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. అందుకే కీమెన్ల తనిఖీలు రైల్వే భద్రతలో అత్యంత కీలకంగా భావిస్తారు. రాత్రి వేళల్లో ప్రత్యేక పహారా కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా భారీ వర్షాలు, ట్రాక్ మరమ్మతులు జరుగుతున్న ప్రాంతాలు, ప్రమాద సూచనలు ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచుతారు.

శిక్షణ, క్రమశిక్షణకు ప్రాధాన్యం

కీమెన్లకు రైల్వే శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. ట్రాక్ లోపాలను గుర్తించడం, అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, సిగ్నలింగ్ విధానాలు, భద్రతా నిబంధనలపై అవగాహన కల్పిస్తారు. చిన్న నిర్లక్ష్యం కూడా భారీ ప్రమాదాలకు కారణమవుతుందని అధికారులు తరచూ హెచ్చరిస్తుంటారు. ఆధునిక సాంకేతికత వచ్చినా, ప్రస్తుతం అల్ట్రాసోనిక్ టెస్టింగ్, ట్రాక్ మెషిన్లు, డ్రోన్ పరిశీలనలు వంటి ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటికీ, కీమెన్ పాత్రకు ప్రత్యామ్నాయం లేదని రైల్వే అధికారులు చెపుతున్నారు. ట్రాక్‌పై నడుస్తూ సూక్ష్మ లోపాలను గుర్తించే అనుభవం ఇప్పటికీ అత్యంత విలువైనదిగా భావిస్తున్నారు.

 బండి సంపత్ కుమార్

(మహబూబాబాద్, విజయక్రాంతి)

‘బరువు’ బాధ్యత తగ్గించాలి

బ్రిటిష్ కాలం నాటి మ్యానువల్స్ ఇప్పటికీ అమలు చేస్తుండటంతో నిత్యం ఎక్కడో ఒక చోట ఇంజినీరింగ్ కార్మికులు మృత్యువాత పడుతున్నారు. రైల్వే కీమెన్ డ్యూటీ అతి కష్టతరంగా మారింది. అతి కొద్దీ రైళ్లు ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన వర్కింగ్ మ్యానువల్స్ ఇప్పుడు వందలాది రైళ్ల రద్దీ పెరిగినా అదే మ్యాన్యూవల్ ప్రకారం పని చేయిస్తున్నారు. ట్రాక్ పక్కన బాలేస్ట్ (కంకర) నిల్వలు హైట్‌గా ట్రాక్ మధ్యలో నడుస్తున్న క్రమంలో ట్రైన్ వచ్చినప్పుడు ఎక్కడం దిగడం ఒక్కోసారి కీ మెన్ జారీ పడిపోవడం జరుగుతోంది.

చలికాలంలో మంచు పొగ కారణంగా ఎదురుగా వస్తున్న ట్రైన్ గమనించక రైలు ప్రమాదంలో చాలా మంది కార్మికులు చనిపోతున్నారు. కీ మెన్ సర్వీస్ దగ్గరపడి, పదవి విరమణ చేసే సమయంలో ట్రాక్ మెన్1 పే స్కేల్ 2,800 ప్రమోషన్ రావడం సుమారు 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కీ మెన్ డ్యూటీ చేయడం సాధ్యం అయ్యో పరిస్థితి లేదు. కీ మెన్ వర్కింగ్ రోజు 12 నుండి 18 కిలోమీటర్లు పెట్రోలింగ్ చేయడం వల్ల చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు.

కీ మెన్ డ్యూటీ ప్రత్యేకంగా చూడాలి. కీ మెన్ పోస్టుకు యువతను సెలెక్ట్ చేసి వారికి ఆర్థిక భరోసా, ఆఫీసియేటింగ్ అలవెన్స్ ఇవ్వాలి. కీ మెన్ బీట్ లేంత్ 2 కిలోమీటర్లకు కుదించాలి. ట్రాక్ మధ్యలో నడిచే బదులుగా ట్రాక్ ప్రక్కన భూమి మీద నడిచే విధంగా ఆదేశాలు ఇవ్వాలి. కీ మెన్ పోస్టులు పెంచి కిమెన్ వర్కింగ్ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండేలా మార్పులు చేయాలి. లైట్ వెయిట్ టూల్స్ అందజేయాలి.

స్మాల్ ట్రాక్ మిషిన్స్ అందుబాటులో తీసుకుని వచ్చి పని, బరువు భారం తగ్గించాలి. కిమెన్ హాట్స్, గ్యాంగ్స్ టూల్ కం రెస్ట్ రూముల నిర్మాణం చేపట్టాలి. ఎప్పుడో ఏర్పాటు చేసిన బ్రిటిష్ వర్కింగ్ మ్యానువల్స్ నేటి ఆధునిక టెక్నాలజీ అనుగుణంగా రివైజ్ చేయాలి.

 ఆవుల యుగంధర్, మజ్దూర్ యూనియన్, 

వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ