7 May, 2026 | 1:29 AM

ఉమ్మడి జిల్లాకు కీలక పదవులు

07-05-2026 12:31 AM
  1. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి
  2. వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగా రావు

కరీంనగర్, మే6(విజయక్రాంతి):తెలంగాణ రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో బుధవారం 17 కార్పొరేషన్లకు చైర్మన్లతోపాటు వైస్ చైర్మన్లను నియమించింది. మరికొన్ని కార్పొరేషన్ల చైర్మన్ల భర్తీని ఈ ఏడాది జులైలో చేపడతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వివరించారు.కార్పొరేషన్ పదవుల్లో కీలకమైన రెండు కార్పొరేషన్ పడవులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులకు దక్కాయి.

మున్నురు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరాం చక్రవర్తి, వెలమ కార్పొరేషన్ చైర్మన్ గా జువ్వాడి నర్సింగా రావు లను నియమించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ ఆంధ్రప్రదేశ్ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ని మున్నూరు కాపు కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా నియమించడం పట్ల కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మున్నూరు కాపు సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.మాజీ శాసనసభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వర్ కుమారుడైన శ్రీరామ్ చక్రవర్తి కి రాజకీయ, సామాజిక రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.

సామాజిక న్యాయానికి కట్టుబడి బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్కు సమర్థుడైన నాయకుడిని చైర్మన్గా నియమించడం శుభపరిణామమని పలువురు కాంగ్రెస్ నేతలు, మున్నూరు కాపు సంఘం నాయకులు అన్నారు.

తెలంగాణ రాష్ట్ర వెలమ సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగారావు ను నియమించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి స్వర్గీయ రత్నాకర్ రావు తనయుడు కోరుట్ల నియోజకవర్గం నుండి నాలుగు సార్లు పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు 2009 అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సత్సంబంధాలు కలిగి ఉండి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసీ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.