10 March, 2026 | 1:24 AM

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ 40 ఏళ్ల డిమాండ్

10-03-2026 12:00 AM
  1. రైల్వే డివిజన్ కూడా కావాలి
  2. భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలివ్వాలి
  3. దక్షిణ మధ్య రైల్వే జీఎంతో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ భేటీ 

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్ల నుంచి డిమాండ్ ఉన్నదని, కేంద్రం ఇటీవల ఒక ప్రకటన చేసిందని బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి సోమవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌తో వినోద్‌కుమార్ భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం కేంద్రం ప్రకటన చేసిందని, అయితే స్థానిక నాయకులు ఒప్పించి ఇక్కడ రైతులతో మాట్లాడారని గుర్తుచేశారు. చాలా మంది తక్కువ ధరతో భూమి ఇవ్వడానికి ఒప్పుకున్నారని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాకుండా మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌కు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. ప్రైవేట్ వాళ్లు పనులు చేస్తున్నట్టు జీఎం తెలిపారని, కాజీపేట రైల్వే డివిజన్ కావాలని కోరినట్టు వివరించారు.

అది రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పారని, రైల్వే బోర్డుకు ఈ డిమాండ్ వివరిస్తామని జీఎం చెప్పారని వెల్లడించారు. భూ నిర్వాసితులకు తగిన హామీ కోసం కృషి చేస్తామన్నారని పేర్కొన్నారు. అరూరి రమేశ్ మాట్లాడుతూ.. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అయోధ్యపురంలో భూములు కోల్పోయినవారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరామన్నారు.

మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విద్యార్థి దశ నుంచి పోరాటం చేశారని, అందుకే ఇప్పుడు పనులు జరుగుతున్నాయని తెలిపారు. భూ సేకరణ గతంలో ఇబ్బందులు అయ్యాయని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులతో మాట్లాడి భూములు ఇప్పించామని గుర్తుచేశారు. లాతూర్‌లో ఎలాగైతే స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చారో కాజీపేటలో కూడా భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు.