27 February, 2026 | 5:01 PM

మీ అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణం!

27-02-2026 03:01 PM
  • హైదరాబాద్: తాను చెప్పిందే నిజమని ఇవాళ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు(Delhi Rouse Avenue Court) తీర్పుతో తేలిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అన్నారు. తనను 5 నెలలు జైలులో ఉంచి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు తేలకుండానే తన వ్యక్తిత్వ హననం చేశారని తెలిపారు. ఎక్స్ లో అన్న కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) పెట్టిన ట్వీట్ చూశానన్న ఆమె తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిందన్నట్లుగా పోస్టు చేశారని చెప్పారు. ''బీఆర్ఎస్ నేతలకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి నేను కారణమా? ప్రజలకు ఇళ్లు, ఉద్యోగాలు, అభ్యర్థులను మార్చకుండా మళ్లీ వాళ్లకే టికెట్లు ఇవ్వటమే కారణం'' అన్నారు. దోపిడీదారులకే మళ్లీ టికెట్లు ఇచ్చి ప్రజలపై రుద్దే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.

అన్నింటికంటే ముఖ్యంగా మీ అహంకార ధోరణే బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీ ఓటమికి కారణమని ఆరోపించారు. ఇవాళ కోర్టు తీర్పును మీకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓటమిని తన మెడలో వేయాలని చూడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. కేటీఆర్ ఇప్పటికైనా మీరు ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. వాస్తవాలు ఒప్పుకుని మీ లోపాలను సరిచేసుకోవాలని హెచ్చరించారు. ఎన్నికలప్పుడు ఏం జరిగిందో మర్చిపోయి తనను బ్లేమ్ చేయొద్దని కోరారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి తనకు ఎప్పుడూ మద్దతు రాలేదని ఆరోపించారు. తనపై పెట్టిన కేసులపై మూడేళ్లుగా ఒంటరిగా పోరాడుతున్నానని చెప్పుకొచ్చారు. మరో మూడు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నానని చెప్పిన కవిత పార్టీ పెట్టే ముందే తీర్పు రావటం సంతోషకరం అన్నారు. సొంతంగా పార్టీ పెట్టాలంటే చాలా ధైర్యం కావాలని కవిత వివరించారు. పిడికెడు మందితోనే రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తిగా మారుతా అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్(BJP, BRS) రెండూ ఒకటే.. మళ్లీ చెప్పాల్సిన పనిలేదన్నారు. కేవలం ఒక వ్యక్తి వల్ల ఓడిపోయేంత బలహీనంగా పార్టీ ఉందా? అని ప్రశ్నించారు. వైఫల్యాలను విస్మరించి ఓటమిని తన మెడలో వేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డను అవమానించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కవిత హెచ్చరించారు.