23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక
100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈనెల 22న యాదగిరిగుట్టను సందర్శించనున్న కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ఈనెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భవానీ శంకర్ తెలిపారు. 100 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. మంగళవారం దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 23న ఉదయం 9 గంటల 27 నిమిషాలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుంటారని అనంతరం, టెంపుల్ సిటీ నందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమంలో కంచి పీఠాధిపతి శ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో పాల్గొంటారని అనంతరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది తెలిపారు.
దేవస్థానం కొండపైన నూతనంగా కళ్యాణమంటపం, దీక్షాపరుల సదనం,కొండ కింది నుండి కొండపై వరకు మెట్ల దారి వెంట పైకప్పు షెడ్డును నిర్మించడం, పిఆర్ఓ ఆఫీస్ ఎదురుగా నూతనంగా మాడవీధులకు వెళ్ళేందుకు మెట్ల మార్గం (ఎక్సలేటర్) సదుపాయం ను పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కంచి పీఠాధిపతి శంకరా విజయేంద్ర సరస్వతి పాల్గొంటారని తెలిపారు. కంచి పీఠాధిపతి శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారు ఈనెల 22న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు రానున్నారని తెలిపారు.
శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి వారు ఈనెల 22వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి విచ్చేయుచున్నారని 4 గంటల నుండి 4: 45 నిమిషాల వరకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండపైన కళావేదిక వద్ద సాయంత్రం 6 గంటలకు భజన కార్యక్రమంలో పాల్గొంటారని,32 మంది చతుర్వేద పారాయణం అనంతరము విజయేంద్ర సరస్వతి వారు ప్రసంగం ఉంటుందని ఈ కార్యక్రమానికి భక్తులు స్థానికులు అధిక సంఖ్యలో రావాలని ఈ ఓ భవాని శంకర్ తెలిపారు.






