బహు కళాశిల్పి కళ్యాణం
- సాహిత్యం, యానిమేషన్, చిత్రకళ, కృత్రిమ మేధ రంగాల్లో బహుముఖ సేవలు
- కరీంనగర్‌కు వన్నెతెస్తున్న కళ్యాణం శ్రీనివాస్
‘సాహిత్యం, చిత్రకళ, జర్నలిజం, కార్టూనింగ్, యానిమేషన్, కృ త్రిమ మేధస్సు(ఏఐ) ఆధారిత సంగీతం, షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, ఫీచర్ ఫిల్మ్ నిర్మాణం.. ఇలా ఒకే వ్యక్తిలో అనేక ప్రతిభలు మిళితమైన అరుదైన సృజనకా రుడు కల్యాణం శ్రీనివాస్. తెలుగు సాహిత్యం, కళలు, యానిమేషన్, ఏఐ ఆధారిత సృజనాత్మక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ గ్లోబల్ అచీవర్స్ కౌన్సిల్, సౌత్ వెస్ట్రన్ అమెరికన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఆయనకు తెలుగు సాహిత్యంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి.
ఆయన కుంచెల వన్నెలు.. ఏఐ తలుకల పలకుల పల్లవులు కరీంనగర్‌లో గుబాలిస్తున్నాయి. తెలుగు భాషను నూతన వరవడితో కొత్తపుంతలు తొక్కిస్తున్నాయి. దేశవిదేశాల్లోనూ నవతరాలకు, సాహిత్యకారుల గళాల్లో సంగీత జల్లులు కురిపిస్తున్నాయి.’
సాహిత్యంతో ప్రారంభమైన కళ్యాణం శ్రీనివాస్ ప్రయాణం క్రమం గా విభిన్న రంగాలకు విస్తరించింది. చిన్ననాటి నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్న శ్రీనివాస్ పదో తరగతి నుంచే కవిత్వ రచన ప్రారంభించారు. అనంతరం బీఏ లిటరేచర్ పూర్తి చేసి, ఎంఏ తెలుగు సాహిత్యంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించారు. విద్యార్థి దశలోనే ‘హృదయమన గేయ సంపుటి’, ‘పిడికిలి కవితా సంపుటి’ అనే రెండు పుస్తకాలను ప్రచురించి రచయితగా గుర్తింపు పొందారు. ఆయన రచించిన అనేక గేయాలు వివిధ వేదికల ద్వారా ప్రజల్లోకి చేరాయి.
200కు పైగా పుస్తకాలకు ముఖచిత్రాలు వేయడం ద్వారా ప్రతిభావంతమైన చిత్రకారుడిగా ఆయన విశేష గుర్తింపు పొందారు. తద్వార అనేక మంది రచయితల రచనలకు కళాత్మక రూపాన్ని అందించారు. జర్నలిజంపై ఆసక్తితో వివి ధ దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు. అదే సమయంలో రాజకీయ కార్టూనిస్టుగా కూడా సేవలందిస్తూ సమకాలీన అంశాలపై తనదైన శైలిలో కార్టూన్లు రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. సంప్రదాయ 2డీ యానిమేషన్‌లో రెండు దశాబ్దాల అనుభవం సాధించారు.
1996లో లక్ష్మీపతి స్కాలర్షిప్ లభించడంతో హైదరాబాద్‌లో యానిమేషన్ కోర్సు పూర్తి చేసిన ఆయన, అనంతరం దాదాపు 20 సంవత్సరాలకు పైగాగా యానిమేషన్ పరిశ్రమలో పనిచేశారు. సినిమా భాష, విజువల్ స్టోరీ టెల్లింగ్, షాట్ కంపోజిషన్, స్క్రీన్‌ప్లే, కెమెరా వ్యాకరణం, ఎడిటింగ్ తదితర అంశాలపై ఆయ నకు ఉన్న లోతైన అవగాహన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘లేడీ లక్’ సిరీస్‌ను 20 మంది సీనియర్ యానిమేటర్లు కలిసి చేయాల్సింది.. కల్యాణం శ్రీనివాస్ ఒక్కరే కేవలం 22 రోజుల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఈ అసాధారణ ప్రతిభను గుర్తిం చిన కెనడాకు చెందిన అంబర్ వుడ్ సంస్థ ఆయనకు ప్రత్యేక ప్రశంసాపత్రం ప్రదానం చేసింది.
యానిమేషన్, చిత్రకళ, కార్టూనింగ్ రంగా ల్లో ఆయనకు అనేక అవార్డులు, ప్రశంసలు, సన్మానాలు లభించా యి. ఏఐ సాంకేతికతను వినూత్నంగా వినియోగిస్తూ ‘పారిజాత‘ అనే ఇన్‌ఫ్ల్యూయె న్సర్‌ను సృష్టించి, ఆమెను కథానాయికగా ఉపయోగిస్తూ సంగీత వీడియోలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు 50కు పైగా తెలుగు పాటలకు స్వయంగా సాహిత్యం రచించి, ఎన్నెన్నో అద్భుతాలు సృష్టించారు.
సాహితీవేత్తల ఏఐ గొంతుగా పాటల పల్లకి
ఏఐ సంగీతాన్ని కేవలం తన సృజనలకు మాత్రమే పరిమితం చేయకుండా, అమెరికా, సింగపూర్, దుబాయ్, జాంబియా దేశాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పల్లవింపజేస్తున్నారు. వందలాది మంది సాహితీవేత్తల పాటలకు పూర్తిగా ఉచితం గా ఏఐ సంగీతాన్ని అందిస్తూ వారి రచనలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ప్రచురణలు, సంగీత రూపం కోసం ఎదురుచూస్తున్న అనేక మంది సాహితీవేత్తల రచనలను ప్రజల్లోకి చేరడమే కాకుండా, స్థబ్దంగా ఉన్న వారి సాహిత్య సృజ నకు కొత్త ఊపునిచ్చారు. ఇలా కొత్త తరం రచయితలు, కవులు, గేయ రచయితలను ప్రోత్సహిస్తున్నారు.
‘ఏఐ వీడియో మేకింగ్ తెలుగు’ బోధనల పదనిస
సాంకేతికతను ప్రతి తెలుగు వ్యక్తికి చేరవేయాలనే లక్ష్యంతో ‘ఏఐ వీడియో మేకింగ్ తెలుగు’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభిం చారు. ఈ ఛానల్ ద్వారా సంగీతం, వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్, సినిమా నిర్మాణంతో పాటు ఆధునిక ఏఐ టూల్స్ వినియోగంపై వేలాది మందికి సులభమైన తెలుగులో అవగాహన కల్పిస్తున్నారు. ‘కల్యాణం శ్రీనివాస్ ఏఐ ఫిలిం మేకింగ్ అకాడమీ‘ సంస్థను స్థాపించారు. తెలుగు యువతను ప్రపంచస్థాయి ఏఐ సినీ సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఇటీవల ‘వందే మాతరం’, పోక్సో చట్టంపై, ‘శ్మశానం’ షార్ట్ ఫిల్మ్‌ను నిర్మించి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ‘మాయపుటలు’ వెబ్ సిరీస్ ఉన్నాడు. అంతా ఏఐ సాంకేతికతతో తెలుగు సినీ పరిశ్రమలో కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు.
బల్మూరి విజయసింహారావు, విజయక్రాంతి, కరీంనగర్






