22 August, 2026 | 3:21 AM

‘ఖేలో ఇండియా’పై జ్వాలా ప్రశంసలు

22-08-2026 12:18 AM

క్రీడారంగంలో పెనుమార్పులు సాధ్యం

పథకానికి మద్దతు

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): పునరుద్ధరించిన ‘ఖేలో ఇండియా’ పథకం భారత క్రీడారంగం రూపు రేఖలను మార్చే సామర్థ్యం కలిగి ఉందని బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్ ప్లేయర్ జ్వాలాగుత్తా అభిప్రాయపడ్డారు. ఈ పథకం క్రీడారంగంలో పెనుమార్పు తీసుకొచ్చి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుందని, చాలాకాలం క్రితమే ఈపథకం రావాల్సిందని ఆమె పేర్కొన్నారు.

తాను కూడా ప్రభుత్వ అండతోనే ఎదిగాననీ, ప్రభుత్వ మద్దతు లేకుండా ఒక క్రీడాకారిణిగా తాను సాధించినదంతా సాధ్యమయ్యేది కాదని తెలిపారు. కొత్త రూపంలోని ఈ ఖేలో ఇండి యా పథకం చాలా ఆశాజనకంగా కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయి నుంచి అభివృద్ధి, సుస్థిరతపై దృష్టి సారించడంతో, పిల్లలను క్రీడలకు పంపడాన్ని తల్లిదండ్రులు సురక్షితంగా భావిస్తున్నారని చెప్పా రు. క్రీడలను ప్రోత్సహించడంపై ప్రభుత్వం ఎల్లప్పుడూ శ్రద్ధ వహిస్తూనే ఉందన్నారు.

జ్వాలాగుత్తాతో పాటు తెలంగాణ క్రీడాప్రాధికార సంస్థ (ఎస్‌ఏటీఎస్)వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ సోనిబాలాదేవి, బెంగళూరులోని భారత క్రీడా ప్రాధికారసం స్థ (ఎస్‌ఏఐ) ప్రాంతీయ డైరెక్టర్ శ్రీ విష్ణు సుధాకరన్, ఢిల్లీలోని ఎస్‌ఏఐ డిప్యూటీ డైరెక్టర్ ఎస్ హిమబిందు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. ‘ఖేలో ఇండి యా’ పథకంలోని కీలక అంశాలను, తెలంగాణ వంటి రాష్ట్రంపై చూపించే ప్రభావాన్ని వివరించారు. 2026 కాలానికి అమలయ్యే ఈ పథకానికి గత కేటాయింపుతో పోలిస్తే 8 రెట్లు పెంచి రూ.29,054కోట్లను కేటాయించారు. ఈ పథకం ద్వారా మద్దతు పొందే క్రీడాకారుల సంఖ్యను పది రెట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.