14 March, 2026 | 7:18 PM

తాగునీటి సమస్య లేకుండా చర్యలు

14-03-2026 05:45 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జుక్కల్,(విజయక్రాంతి): తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శనివారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పైప్‌లైన్‌ల మరమ్మతులు, నిర్వహణ పనులను తక్షణమే పూర్తి చేసి నీటి సరఫరా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.

మోటార్ల సమస్యలు వంటి చిన్న చిన్న లోపాలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించాలని చెప్పారు. ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదో లేదో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు సక్రమంగా అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.