17 June, 2026 | 4:25 PM

ఇంధన పొదుపుకు జడ్జి వినూత్న సందేశం

17-06-2026 03:03 PM

కాలినడకన కోర్టుకు చేరుకున్న ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి అనంతలక్ష్మి

ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంతలక్ష్మి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఆమె అధికారిక వాహనాన్ని ఉపయోగించకుండా కాలినడకన కోర్టుకు చేరుకుని ఆదర్శంగా నిలిచారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం, ఇంధన వినియోగం వంటి సమస్యలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న చిన్న మార్పులతోనే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం యాంత్రిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోతున్న నేపథ్యంలో నిత్యం కొంత దూరం కాలినడకన నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సూచించారు. ఇంధన పొదుపుతో పాటు ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కాపాడిన వాళ్ళం అవుతామని తెలిపారు.పర్యావరణ హిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ఆమె ఇచ్చిన సందేశం అందరికీ ఆదర్శంగా నిలిచింది.