182 కోట్ల జిహాదీడ్రగ్ పట్టివేత
- ఎన్సీబీ ఆపరేషన్ ‘రెజిపిల్’తో స్వాధీనం
- అధికారులకు కేంద్రహోంమంత్రి అమిత్‌షా అభినందనలు
న్యూఢిల్లీ, మే 16: మాదకద్రవ్యాల రవాణాపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలిపోకుండా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చేపట్టిన ఆపరేషన్ ‘రెజిపిల్’ ద్వారా రూ. 182 కోట్ల విలువైన ‘జిహాదీ డ్రగ్’ అని పిలిచే క్యాప్టగాన్‌ను స్వాధీనం చేసుకుంది. ఓ సిరియా జాతీయుడిని అదుపులోకి తీసుకున్నారు. అధికార వర్గాల ప్రకారం ఢిల్లీ నుంచే ఈ భారీ నెట్‌వర్క్‌ను నడుపుతున్నట్లు సమాచారం. గుజరాత్‌లోని ముంద్రాపోర్టు, ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఈ డ్రగ్‌ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్ సిరియా నుంచి భారత్‌కు వచ్చింది. ఇక్కడి నుంచి సౌదీ అరేబియాకు తరలించేందుకు ఢిల్లీలోని ఓ ప్రాంతంలో తేయాకు కార్డున్‌లలో సిద్ధం చేసి ఉంచారు. ‘క్యాప్టగాన్’ ఫెనెథిలిన్ ఆంఫెటమైన్ అనే మత్తుపదార్థం. మధ్యప్రాచ్యంలోని యుద్ధపీడిత ప్రాంతాలలో, ఉగ్రవాద సంస్థలు, మిలిటెంట్లలో దీని వాడకం ఎక్కువ. అందుకే దీనికి ‘జిహాదీ డ్రగ్’ అనే పేరు వచ్చింది.
డ్రగ్ రహిత భారత్ నిర్మాణమే ప్రభుత్వ సంకల్పం: అమిత్‌షా..
ఎన్సీబీ చేపట్టిన ‘రెజిపిల్’కు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శనివారం ఎక్స్‌లో పంచుకున్నారు. డ్రగ్ రహిత భారత్‌ను నిర్మించాలని ప్రధాని మోదీ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఆపరేషన్ రేజ్‌పిల్‌లో భాగంగా ఎన్సీబీ భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకుందని తెలిపారు. మాదక ద్రవ్యాలపై జీరో టోలరెన్స్‌కు ఇది ఉదాహరణ అని అభివర్ణించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మాదకద్రవ్యాల రవాణాకు తమ భూభాగాన్ని ఉపయోగించ డాన్ని భారతదేశం అనుమతించబోదన్నారు.
భాగస్వామ్యం పంచుకున్న ప్రతీఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేసేవారికి అమిత్‌షా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేసిన ఎన్సీబీ అధికారులను ఆయన అభినందించారు.






