10 April, 2026 | 1:50 AM

ఆంటోనీ వేస్ట్‌లో జేఎఫ్‌ఈ 750 మిలియన్ యెన్‌ల పెట్టుబడి

10-04-2026 12:03 AM

గురువారం, 09 ఏప్రిల్ 2026: భారతదేశంలోని ప్రముఖ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటైన 'ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్  కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు కోసం జపాన్‌కు చెందిన జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌'తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. భారతదేశపు వేస్ట్-టు-ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన తొలి జపనీస్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే కావడం విశేషం.

అలాగే జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ కార్పొరేషన్‌కు కూడా భారత వ్యర్థాల నిర్వహణ మార్కెట్లోకి ఇదే తొలి అడుగు. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఆంటోనీ వేస్ట్‌కు చెందిన రెండు వేస్ట్-టు-ఎనర్జీ 'స్పెషల్ పర్పస్ వెహికల్ లలో 25% ఈక్విటీ వాటాను కొనుగోలు చేయడానికి జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ దాదాపు 750 మిలియన్ యెన్‌లను పెట్టుబడిగా పెడుతుంది. మిగిలిన 75% వాటా ఆంటోనీ వేస్ట్ వద్ద ఉంటుంది. అంతేకాకుండా, ఈ రెండు వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ మరియు కన్స్ట్రక్షన్ బాధ్యతలను జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ ఇండియా తీసుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని కడప మరియు కర్నూలులలో వేస్ట్-టు-ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్న ఎస్పీవీ లలో ప్రత్యేకంగా ఈ పెట్టుబడి పెడుతున్నారు. ఇది దీర్ఘకాలిక ప్రాజెక్ట్ అమలు మరియు విలువ సృష్టి లక్ష్యంగా కుదుర్చుకున్న ప్రాజెక్ట్-స్థాయి భాగస్వామ్య నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భారతదేశ ప్రాధాన్యతా రంగాలలో 10 ట్రిలియన్ యెన్‌ల జపనీస్ పెట్టుబడులను లక్ష్యంగా పెట్టుకున్న 'భారత్-జపాన్ జాయింట్ విజన్ 2025' కు అనుగుణంగా.. సుస్థిర మౌలిక సదుపాయాల కల్పనలో భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ పెట్టుబడి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది.

ఈ పెట్టుబడి భారతదేశపు వేస్ట్-టు-ఎనర్జీ రంగానికి ఒక చారిత్రక ఘట్టంగా ఆంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ జోస్ జాకబ్ చెప్పారు.  తమ ఎగ్జిక్యూషన్ సామర్థ్యాలు, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు , దీర్ఘకాలిక దార్శనికతకు దక్కిన గుర్తింపుగా అభివర్ణించారు. భారత వ్యర్థాల నిర్వహణ రంగంలో అత్యాధునిక సాంకేతికతను, అత్యుత్తమ ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని జేఎఫ్‌ఈ ఇంజనీరింగ్ కార్పొరేషన్  డైరెక్టర్ అకిరా ఉసుయ్ తెలిపారు. భారతదేశం ప్రతిరోజూ దాదాపు 150,000 టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను ఉత్పత్తి చేస్తోంది.