3 June, 2026 | 1:47 AM

తెలంగాణ కోసం గొంతెత్తింది బీజేపీనే

03-06-2026 01:01 AM
  1. కాంగ్రెస్ అధిష్ఠానానికి వందల కోట్లు ఇస్తున్న రేవంత్
  2. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  3. తెలంగాణ ఏర్పాటులో సుష్మా స్వరాజ్ పాత్ర ఎంతో కీలకం
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటు కోసం నాడు బీజేపీ నాయకులైన రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరా జ్ కలిసి పార్లమెంటులో గొంతెత్తారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణ నుంచి ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేరని, కానీ దేశంలోని బీజేపీ ఎంపీలంతా తెలంగాణ ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని నిలదీసి తెలంగాణకు మద్దతు పలికారన్నా రు.

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుక ల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. మలి దశ ఉద్యమం సమయంలో ఢిల్లీలో, రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణితో వ్యవహరించిందని విమర్శించారు. ఒక వైపు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ లు తెలంగాణ బిల్లును ఆపేందుకు పార్లమెంటులో మిర్చి పౌడర్ చల్లుతూ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించారన్నారు.

తెలంగాణ నుంచి వందల కోట్లను రేవంత్ రెడ్డి తీసుకెళ్లి కాంగ్రె స్ అధిష్టానానికి ముట్టజెప్తున్నారని ఆరోపించారు.   మొదటి నుంచీ బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో జా ర్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణను కొందరు ఏటీఎం లాగా మార్చుకుని, కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని అన్నారు.

తెలంగాణ సాధనలో తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ చేసిన కృషి కూడా మరువలేనిదని గుర్తు చేశారు.   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు ఆమె చేసిన సహకారాన్ని  కృతజ్ఞతతో గుర్తుంచుకుంటారని కొనియాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు పరస్పర స్నేహంతో ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ‘వికసిత్ తెలంగాణ’, ‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’ కలిసికట్టుగా అడుగులు వేసినప్పుడే ’వికసిత్ భారత్’ సాకారమవుతుందన్నారు.