ఉద్యమకారుల సేవలు స్మరించుకోవాలి
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- అలాయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు సన్మానం
- హాజరైన ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్సీలు
ముషీరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమకారులను స్మరించుకోవడం తెలంగాణలోని ప్రతి పౌరుడి బాధ్యత అని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. వారిని సన్మానించడం ఆనందదాయకమని అన్నారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర సాధన అనేది లక్షలాది మంది ప్రజల త్యాగాలు, విద్యార్థుల పోరాటాలు, ఉద్యోగ సంఘాల కృషి, కళాకారుల చైతన్యం, మేధావుల మార్గదర్శకత్వం, ఉద్యమకారుల అంకితభావం ఫలితమని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని రాష్ట్ర సాధనకు తమ వంతు సేవలందించిన వివిధ రంగాల ప్రతినిధులను ఈ కార్యక్రమంలో సన్మానించడం ద్వారా వారి సేవలను గుర్తించి భావితరాలకు స్ఫూర్తిగా నిలపడం లక్ష్యమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం పోరాడిన ఉద్యమ వీరుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే వారికి నిజమైన నివాళి అని దత్తాత్రేయ పేర్కొన్నారు. బండారు విజయ లక్ష్మి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, సీహెచ్ విఠల్, ప్రొఫెసర్ పురపాటి వెంకట నారాయణ, బూర నర్సయ్యగౌడ్, పాశం యాదగిరి, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.






