6 June, 2026 | 6:53 AM

‘పాలమూరు’ను అడ్డుకున్నదే రేవంత్

06-06-2026 01:32 AM
  1. భూసేకరణపై అవగాహన లేని వ్యాఖ్యలు    
  2. ఆయన సీఎం కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం 
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు  

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : పాలమూరు ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా కేసులు వేయించి, ప్రాజెక్ట్ పనులను అడ్డుకున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి, నాటి కాంగ్రెస్ పార్టీ అని.. మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు వేసిన కేసులను ఎదుర్కొని బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించిందని గుర్తు చేశారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్‌రావు ఫైర్ అయ్యారు.

పాలమూరు  రంగారెడ్డి ప్రాజెక్టు భూసేకరణపై రేవంత్‌రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగంపై కూడా ముఖ్యమంత్రికి అవగాహన లేదని, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమన్నారు. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి కూడా అవగాహన లేదా? మీ ప్రభుత్వం రాసిన  లేఖల్లో ఏం ఉందో మీ ఇద్దరికీ తెలియదా?, 30 నెలలు దాటింది ఇంకెప్పుడు ఇరిగేషన్ మీద ప్రిపేర్ అవుతారు? అని ఎద్దేవా చేశారు.

2026 మే 2న తెలంగాణ ఈఎన్సీ జనరల్  కృష్ణా బోర్డుకు లేఖ రాసిన లేఖ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ 74.23 శాతం, తెలంగాణ కేవలం 25.77శాతం నీటిని వినియోగించుకున్నదని.. ఇది వాస్తవం కాదా? అని మండిపడ్డారు.  12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించే పాలమూరు- ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరుకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసిందని, మీరు ఎన్ని ఎకరాలు సేకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏడాదికి 6 లక్షల ఎకరాల చొప్పున, రెండేళ్లలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పిన రేవంత్‌రెడ్డికి.. ఇరిగేషన్ గురించి మాట్లాడే హక్కు, అర్హత  లేవని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టడం ప్రచారం చేసుకున్నంత సులువు కాదని హితవు పలికారు.  కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసి 10 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లుందించిన ఘనత మాదన్నారు. తెలంగాణ ఈఎన్సీ జనరల్ రాసిన లేఖను జత చేస్తున్నా, చదువుకో.. ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడటం మానేయాలని హితవు పలికారు.