6 August, 2026 | 3:52 AM

అలంకారప్రాయం హైవే లైట్లు!?

06-08-2026 01:48 AM

గరిడేపల్లి, ఆగస్టు 5: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో జాతీయ రహదారి భద్రత ప్రశ్నార్థకంగా మారింది. హైవేపై ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు నెల రోజులుగా వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణసం కటంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, శాఖల మధ్య సమన్వయ లోపం వెరసి ప్రజలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. నెల రోజులుగా చీకటి సామ్రాజ్యం గరిడేపల్లి మండల కేంద్రం, కీతవారిగూడెం, రాయినిగూడెం, ఎల్బీ నగర్ గ్రామాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి 167పై హైవే లైట్లు వెలిగి నెల రోజులు దాటుతోంది.

రాత్రి వేళల్లో ఈ మార్గమంతా చిమ్మచీకట్లు అలుముకోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాల ముప్పులో ప్రయాణికులు ఈ రహదారిపై రాత్రి సమయాల్లో వాహనాలు అత్యధిక వేగంతో రాకపోకలు సాగిస్తుంటాయి. వెలుతురు లేకపోవడంతో ద్విచక్ర వాహనదారులు, అత్యవసర సేవల వాహనాలు నడిపేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ముగిసిన కాంట్రాక్ట్.. మారిన బాధ్యతలు

హైవే స్ట్రీట్ లైట్ల నిర్వహణ చూస్తున్న కేపిసి కంపెనీ కాంట్రాక్ట్ జూన్ 30, 2026తో ముగిసింది. దీంతో ఆ సంస్థ నిర్వహణను పూర్తిగా నిలిపివేసింది. నిబంధనల పేరుతో జాతీయ రహదారుల అధికారులు ఈ బాధ్యతలను గ్రామ పంచాయతీలకు అప్పగించాలని సర్క్యులర్ జారీ చేశారు. అయితే నిర్వహణ వ్యయం, భారీ విద్యుత్ బిల్లులు భరించలేక పంచాయతీలు చేతులెత్తేస్తున్నాయి. ఇప్పటికైనా జాతీ య రహదారుల శాఖ అధికారులు, ప్రభు త్వం స్పందించి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించి, హైవే స్ట్రీట్ లైట్లను వెంటనే వెలిగించి ప్రాణ నష్టాలను నివారించాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

పంచాయతీలపై ఆర్థిక భారం

ఇప్పటికే గ్రామ పంచాయతీలపై అభివృద్ధి పనులు, సిబ్బంది జీతాల భారం అధికంగా ఉంది. ఒక్కో గ్రామ పంచాయతీకి కేవలం హైవే లైట్ల విద్యుత్ బిల్లుల రూపంలోనే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ ఆర్థిక భారాన్ని మోయడం పంచాయతీల వల్ల కాదు

గుండు రామాంజి గౌడ్, 

సర్పంచ్ రాయినీగూడెం, 

సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట