18 June, 2026 | 12:45 PM

వనమహోత్సవం మొక్కుబడి కార్యక్రమం కాదు

18-06-2026 11:31 AM

హైదరాబాద్: నేడు ప్రారంభించే వనమహోత్సవంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy ) ఎక్స్ లో పోస్టు చేశారు. వనమహోత్సవం మొక్కుబడి కార్యక్రమం కాదన్న సీఎం పర్యావరణహిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే యజ్ఞం అన్నారు. మొక్కవోని దీక్షతో నిన్నటి విధ్వంస జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పమని పేర్కొన్నారు. గురువారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమం ప్రారంభం కానుంది. వనమహోత్సవానికి అటవీశాఖ ముమ్మర ఏర్పాట్లు చేసింది. సీఎం రేవంత్ రెడ్డి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పార్కులో(Gurramguda Eco Park) సీఎం రేవంత్ మొక్క నాటనున్నారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్టులో రూ. 17.84 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. బీఎన్ రెడ్డిలో రూ. 35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

''ఈ రోజు గుర్రంగూడలో ప్రారంభించే వనమహోత్సవం కు ఒక ప్రాధాన్యత ఉంది. ఇది కేవలం మొక్కుబడి కార్యక్రమం కాదు. “మొక్క”వోని పట్టుదలతో నిన్నటి విధ్వంస సంఘటనల జ్ఞాపకాల నుండి తీసుకున్న సంకల్పానికి ఫలితం.  చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా… ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలం…. ఇదీ గత పాలనా దృశ్యం.  చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించి, పర్యావరణ హిత నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే యజ్ఞం… ఇది నేటి పాలన దృశ్యం. 2021లో ఇదే గుర్రంగూడలో వరదల సమయంలో మల్కాజ్ గిరి ఎంపీగా(Malkajgiri MP) పర్యటించినప్పుడు నా మదిలో కలిగిన ఆవేదన నుండి పుట్టిన ఆలోచనకు ఆచరణ ఈనాటి గుర్రంగూడ అటవీ భూమిలో జరిగే వనమహోత్సవం.  ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కబ్జాదారుల పై న్యాయపోరాటం చేసి, అటవీ భూములను రక్షించి, నగరాన్ని వనంలో జనం జీవించే ప్రాంతంగా తీర్చిదిద్దే మా ప్రయత్నానికి ఈరోజు నిర్వహించే గుర్రంగూడ వనమహోత్సవం ఒక ఉదాహరణ.'' అని సీఎం రేవంత్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.