ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
- తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు, కేసు
- ఎన్పీఏ తాత్కాలిక సస్పెన్షన్ వేటుతో తీవ్ర మనస్థాపం!
- మోతీనగర్‌లోని సోదరుడి ఇంట్లో శానిటైజర్ తాగిన వైనం
- ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
- ఆమెతో ఏడాదిగా సాన్నిహిత్యం ఉంది
- సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఉదయ్ కృష్ణారెడ్డి?
రంగారెడ్డి/సికింద్రాబాద్, జూలై 20 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆపై శాఖాపరమైన చర్యల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు.
ఎర్రగడ్డ మోతీనగర్‌లోని తన సోదరుడి నివాసంలో శానిటైజర్ తాగి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ఎస్సార్ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వైద్యులు అత్యవసర విభాగంలో నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారని సమాచారం. జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న వేళ, ఉదయ్ కృష్ణారెడ్డి తనను గదిలో బంధించి దాడి చేయడమే కాకుండా లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్పీఏ ప్రివిలేజ్ కమిటీ, సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను పరిశీలించి ఆరోపణల్లో ప్రాథమిక నిజం ఉందనే ముగింపునకు వచ్చింది. ఈ క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనను సర్వీసులోకి పునరుద్ధరించాలా లేదా శాశ్వతంగా తొలగించాలా అనే అంశంపై కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డిఓపిటి) తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు!
ఆత్మహత్యాయత్నానికి ముందు ఉదయ్ కృష్ణారెడ్డి తన వాట్సాప్ స్టేటస్‌లో ‘నా తప్పేమీ లేదు’ అని పేర్కొనడమే కాకుండా, ఒక సూసైడ్ నోట్ రాసి ఉంచినట్లు వెలుగులోకి వచ్చింది. ‘మహిళా ట్రైనీ అధికారితో నాకు గత ఏడాది కాలంగా సాన్నిహిత్యం ఉంది. ఆమెకు వేరే వ్యక్తితో వివాహం జరిగిన తర్వాత కూడా మళ్లీనా గదికి వచ్చింది. మా మధ్య సంబంధం కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు నా వద్ద ఉన్నాయి.
నా చావుకు నలుగురు వ్యక్తులు కారణం’ అని రాసినట్టు సమాచారం. ఒకే ఘటనతో సంబంధం ఉన్న ఈ రెండు పరిణామాలపై పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. అత్తాపూర్ పోలీసులు నమోదు చేసిన వేధింపుల కేసుతో పాటు, ఎస్సార్ నగర్ పోలీసులు ఆత్మహత్యాయత్న ఘటనపై విడివిడిగా విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను, వాట్సాప్ సందేశాలను, ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్, వీడియో ఆధారాలను స్వాధీనం చేసుకుని సమగ్ర పరిశీలన జరుపుతున్నారు.
మద్యం అతిగా సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి: పోలీసులు
ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యకు యత్నించలేదని పోలీసులు స్పష్టం చేశారు. మద్యం అతిగా సేవించడం వల్లే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడని తెలిపారు. ఉదయ్ విషం తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.






