calender_icon.png 7 February, 2026 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘చేయి’జారి పోతుందా?

07-02-2026 12:09:04 AM

  1. రసవత్తరంగా మున్సిపల్ ఎన్నికలు

మొయినాబాద్లో ఎదురీత

ప్రచారంలో ప్రతిపక్షల స్పీడ్

కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం!

దిద్దుబాటు చేపట్టిన నేతలు

మొయినాబాద్, ఫిబ్రవరి 6( విజయక్రాంతి )రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఎదురీత తప్పడం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న ధీమా ఉందో లేక అభ్యర్థుల్లో గెలుపుపై నమ్మకం సన్నగిల్లిందో తెలియదు కానీ మొయినాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది.

ఎన్నికల నగారా మోగి, ప్రచారం హోరెత్తాల్సిన సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు కనీసం ఇంటి గడప దాటకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాడ కనిపించడం లేదు. ప్రత్యర్థి పార్టీలు ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతుంటే, కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం కనీసం ఓటర్లను కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సామాన్య ఓటర్లలో అసలు కాంగ్రెస్ పోటీలో ఉందా? లేక ముందే చేతులెత్తేసిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

దిద్దుబాటు చర్యల్లో మహేందర్ రెడ్డి

క్షేత్రస్థాయిలో పార్టీ గ్రాఫ్ పడిపోతుండటంతో అప్రమత్తమైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, అభ్యర్థుల్లో కదలక లేకపోవడం ఆయనకు కూడా తలనొప్పిగా మారింది. నాయకులు మేకప్ వేస్తున్నా, క్షేత్రస్థాయిలో ‘సీన్’ మాత్రం రివర్స్లో ఉండటం గమనార్హం.

ఏం జరుగుతోంది?

పార్టీ అంతర్గత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. దీని వెనక ప్రధానంగా మూడు కారణాలు వినిపిస్తున్నాయి.అంతర్గత కుమ్ములాటలు... టికెట్ల కేటాయింపులో జరిగిన జాప్యం, అసంతృప్త నేతల సహాయ నిరాకరణ పార్టీని దెబ్బతీస్తోంది. మరో పక్క నాయకత్వ లోపం తేట తెల్లమవుతుంది.  స్థానిక నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో క్యాడర్ ఎటు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉంది.

గెలుపుపై ధీమా లేకపోవడంతో అభ్యర్థులు ఖర్చు పెట్టేందుకు వెనకాడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నాయకులు ఏసీ రూముల్లో సమావేశాలు పెడితే ఓట్లు రావు, ప్రజల్లోకి వస్తేనే ఫలితం ఉంటుంది అని కాంగ్రెస్ సానుభూతిపరులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

మొత్తానికి మొయినాబాద్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కల, ప్రస్తుత ‘ప్రచారలోపం’ చూస్తుంటే కల్లగానే మిగిలిపోయేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తక్షణమే వ్యూహం మార్చకపోతే ‘చేయి’ జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.