calender_icon.png 7 February, 2026 | 6:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోశాలలు ఎటుపాయె!

07-02-2026 02:16:16 AM

  1. ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఫలితం శూన్యం
  2. నిర్ణయం తీసుకుని నెలలు గడుస్తున్నా నిర్మాణంలో జాప్యం
  3. గో సంరక్షణపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నా స్పందించని ప్రభుత్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి) : భారతదేశంలో గోవులను ఎంతో పవిత్రంగా భావించే సంప్రదా యం ఉన్నప్పటికీ గో సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోంది. గో సంరక్షణ కోసం ప్రత్యేకంగా గోశాలలను ఏర్పాటుచేస్తామని ప్రకటించి నెల లు గడుస్తున్నా ముందడుగు పడలేదు. అన్ని సౌకర్యాలతో కనీసం 50 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్రవ్యాప్తంగా గోశాలలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఏడాది జూన్‌లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

కానీ, ఇప్పటికీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. గోసంరక్షణపై ప్రకటనలు, ప్రణాళికలు, కమిటీల ఏర్పాటుకే ప్రభుత్వం పరిమితమైంది. గోశాలల నిర్మాణంలో జాప్యం, గోవుల మృత్యువాత, నిధు ల విడుదల ఆలస్యం వంటి అంశాలపై విపక్షాలు, స్వచ్ఛం ద సంస్థలు, ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గోశాలల నిర్మాణం స్థల సేకరణ, టెండర్ల దశకే పరిమితం కావడంతో ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.

‘ప్రభుత్వం గోశాలలు ఎప్పుడు నిర్మిస్తుంది? నిధులు ఎప్పుడు విడుదల చేస్తుంది? ఎవరు బాధ్యత వహిస్తారు?’ వంటి ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారిక సమాధానాలు లేవు. గోశాలల కోసం వేల ఎకరాల భూములు గుర్తించినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నా, పనులు ప్రారంభం కాకపోవడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన వివరణ లేదు. రోడ్లపై తిరుగుతున్న గోవులు ప్రమాదాలకు గురై చనిపోతున్నా ఘటనలు పెరుగుతున్నాయి. నగరాల్లో సరైన స్థలం లేక గోశాలల్లోనే గోవులు మరణిస్తున్నాయని నివేదికలు చెబుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. 

నిర్మాణంలో తీవ్ర జాప్యం.. 

గోశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినా నిధుల విడుదల ఆల స్యం కావడంతో ప్రాజెక్టులు నిలిచిపోయాయని అధికారవర్గాల నుంచి తెలుస్తోంది. అధికారులు, కాంట్రాక్టర్ల మధ్య సమన్వయ లోపం కారణంగా అనేక జిల్లాల్లో పనులు ఆగిపోయినట్టు సమాచారం. హైదరాబాద్, మేడ్చల్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ వంటి జిల్లాల్లో గోశాలల నిర్మా ణంలో జాప్యం అవుతుండటంతో అనాథ పశువులు రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు గురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.

ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రభుత్వ గోశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఆయా ప్రాంతాల్లో భూముల ఎంపిక, బడ్జె ట్ కేటాయింపులు జరిగినా, గోశాలల నిర్మా ణం కార్యరూపం దాల్చడంలో మాత్రం ఎక్కడా స్పష్టమైన పురోగతి కనిపించడం లేదు. కొన్నిచోట్ల ఇప్పటికీ స్థలాన్ని కూడా గుర్తించలేదని తెలుస్తోంది. అయితే దీనికి నిధుల విడుదల ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గోశాలల నిర్మాణానికి తగినంత నిధులు కేటాయించకపోవడం, కేటాయించిన నిధుల విడుదలలో జాప్యం కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

గోశాలల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించకపోవడంతోనే పశు సంరక్షణ కరువైందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లి ప్రాంతా లలో భారీస్థాయిలో గోశాలలను ఏర్పాటుచేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకు న్న తెలంగాణ ప్రభుత్వం రాష్ర్టవ్యాప్తంగా సకల సదుపాయాలతో మరిన్ని గోశాలలను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది.

ఇందులో భాగంగా గోసంరక్షణ కోసం పశుసంవర్థకశాఖ చీఫ్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్‌తో కూడిన ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వేములవాడ, యాదగిరిగుట్ట, ఎన్కేపల్లిలో సుమారు వంద ఎకరాల్లో, మిగతా ప్రాంతాల్లో కనీసం 50 ఎకరాల విస్తీర్ణం తగ్గకుండా గోశాలలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే వేములవాడలో దాదాపు 60 ఎకరాలు, యాదగిరిగుట్టలో 40 నుండి 50 ఎకరాలు గుర్తించి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించారు. కానీ ఈ గోశాలల ప్రతిపాదనలకు ఆమోదం లభించలేదు. 

నిధుల విడుదలపై స్పష్టతలేదు..

21 అధునాతన గోశాలల కోసం ఒక్కోదానికి రూ. 50 కోట్లుగా అంచనాలు వేసినా, వాస్తవంగా ఎంత నిధులు విడుదలయ్యాయన్న విషయంపై స్పష్టత లేదు. బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నప్పటికీ, అధికారులు ‘నిధుల విడుదలలో ఆలస్యం’ అని చెబుతున్నా, ఎందుకు ఆలస్యం అవుతుందన్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదు. గోశాలలను నడుపుతున్న స్వచ్ఛంద సంస్థలు ఆహారం, మందులు, వెటర్నరీ సేవల కోసం పదేపదే ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నా స్పందన లేదని ఆరోపి స్తున్నాయి. గోశాలల నిర్మాణం, గో సంరక్షణ అంశంపై మీడియా, ప్రజా సంఘాలు ప్రశ్నలు వేస్తున్నా, అది అరణ్యరోదనే అవుతున్నది. గోసంరక్షణపై ప్రజల్లో ఆందోళన పెరుగుతున్నా, ప్రభుత్వం మాత్రం మిన్నకుంటున్నది.

టెండర్లకే పరమితం.. 

రాష్ర్టంలో గోవుల పోషణ, సంరక్షణ కోసం 21 అధునాతన గోశాలలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పశుసంవర్ధక, రెవెన్యూ, దేవాదాయ, వ్యవసాయ శాఖలకు చెందిన భూముల్లో వీటిని నిర్మించనుంది. అన్ని గోశాలలను ఒకే నమూనాతో నిర్మిస్తారు. ఒక్కో గోశాలకు రూ. 50 కోట్లు అంచనా వేశారు. ఒక ఆవుకు రోజుకు రూ. 80 నుంచి -100 నిర్వహణ ఖర్చవుతుంది. రాష్ర్టవ్యాప్తంగా గోశాలల కోసం 21 స్థలాలను ప్రభుత్వం ఎంపికచేసింది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలో 98 ఎకరాలు, జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పెద్దదిన్నెలో 99.2 ఎకరాలు, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం మదనాపురంలో ఒకచోట 90.06 ఎకరాలు, మరోచోట 36 ఎకరాలు, అదే జిల్లా అడవిదేవులపల్లిలో 43.97 ఎకరాలు, కామారెడ్డి జిల్లా భిక్కనూర్లో 74.25 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో 50 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని హిమాయత్‌సాగర్ వద్ద 40 ఎకరాలు, కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం బొప్పసపల్లిలో 189 ఎకరాలు, నాగిరెడ్డిపేట మండలం మాలుతుమ్మెదలో 450 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 85 ఎకరాలు, జోగులాంబ జిల్లా మానవపాడు మండలం కుర్విపాడలో 50 ఎకరాలు, ఇదే జిల్లా వడ్డెపల్లి మండలం జులెకల్లో 82 ఎకరాలు, నల్లగొండ జిల్లా డిండిలో 153 ఎకరాలు, అదే జిల్లాలోని గుండ్లపల్లి మండలం చెరుకుపల్లిలో 43 ఎకరాలు, నిర్మల్ జిల్లా కడెంలో 27 ఎకరాలు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో 20 ఎకరాలు, కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో 22 ఎకరాల భూమిని ఎంపిక చేశారు. కానీ ఈ గోశాల నిర్మాణపనులు కేవలం టెండర్లకే పరిమితమయ్యాయి.