4 July, 2026 | 1:02 AM

సాగునీరే లక్ష్యం..

04-07-2026 12:00 AM
  1. పెండింగ్ ప్రాజెక్టులకు వేగం 
  2. నీటిపారుదల పనులపై సమీక్షలో ఎమ్మెల్యే మేఘారెడ్డి 

వనపర్తి, జూలై 3 ( విజయక్రాంతి ) : వనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల విస్తరణ, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల పురోగతిపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం నీటిపారుదల శాఖ జిల్లా కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి-5, డి-8 కాలువల విస్తరణ పనులు పూర్తయితే అనేక గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని పేర్కొంటూ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

గొల్లపల్లి, గోపాల్పేట రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని సమీక్షించి, గొల్లపల్లి రిజర్వాయర్కు సంబంధించిన వివరణాత్మక నివేదికను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు.బుద్ధారం స్టేజ్-2 ఆన్లైన్ రిజర్వాయర్, భీమా కెనాల్ విస్తరణ, బుద్ధారం రైట్ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ, కర్నే తండా లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ఘణపురం మండలంలోని గణపసముద్రం రిజర్వాయర్, పెద్దమందడి మండలం గట్ల ఖానాపూర్ రిజర్వాయర్, ఖాన్ చెరువు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. రేవల్లి మండలం తలుపునూరు, తలుపునూరు తండాల్లో సుమారు 2,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఏదుల, అనంతపూర్ గ్రామాల ఆయకట్టు విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

మహబూపాల సముద్రం రిజర్వాయర్ సుందరీకరణ పనులు చేపట్టి పర్యాటకాభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, రైతుల అవసరాలకు అనుగుణంగా పెండింగ్లో ఉన్న నీటిపారుదల పనులను దశలవారీగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ సీఈ, డీసీ, ఎస్‌ఈ, ఈఈ, డీఈలు, ఏఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.