ఇసుక వేలంలో అక్రమాలు విచారణ చేయాలి.. ప్రజా సంఘాల డిమాండ్
నిబంధనల మేరకే వేలం వేశాం
అక్రమాలకు తావు లేదు... ఆర్ఐ చరణ్ కుమార్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యలల పోలీస్ స్టేషన్ ప్రాంగణం లో ఉన్న ఇసుక వేలంలో అక్రమాలు జరిగాయని సంబంధిత రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియకుండా ఆర్ఐ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వచ్చేలా వ్యవహరించారాని జిల్లా కెవిపిఎస్ నాయకులు ఉప్పల్లి మల్కయ్య ప్రకటన లో ఆరోపించారు. గత రెండు సంవత్సరాల నుండి మండలంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న ఇసుకను పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో భద్రపరిచారు.
ఇట్టి ఇసుకను ఆర్ఐ కొందరు కాంట్రాక్టర్లకు కొమ్ము కాసి వేలంలో వారికి అనుకూలంగా ఇసుక దక్కేలా చేశారని ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ ఇన్స్పెక్టర్ చరణ్ కుమార్ ను వివరణ కోరగా సంబంధిత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక వేలం వేయడం జరిగిందని ఇందులో ఎలాంటి అవినీతి, అక్రమాలు జరగలేదని కొడంగల్ లో నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం కాంట్రాక్టర్ ఇసుక వేలంలో పాల్గొని సొంతం చేసుకున్నారని రెవెన్యూ అధికారుల పై వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు.






