22 June, 2026 | 12:16 AM

ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

21-06-2026 03:29 PM

హాజరైన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ పట్టణంలోని ఖేలో ఇండియా ఖో ఖో సెంటర్‌లో ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై యోగా ఆసనాలను పరిశీలించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని, నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం విశిష్టతను వివరిస్తూ యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక ప్రశాంతత పెరుగుతాయనిపేర్కొన్నారు.తెలంగాణ ఒలింపిక్ సంఘం సభ్యులు సిలివేరి మహేందర్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమిరీశెట్టి తిరుపతి లు మాట్లాడుతూ యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరమని, యువత ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి యోగా ఎంతో అవసరమని తెలిపారు. ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ కోచ్, మాజీ భారత జట్టు ఖోఖో క్రీడాకారుడు గెల్లు మధుకర్ యాదవ్ ఆధ్వర్యంలో యోగా ప్రదర్శనలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పీఈటీలు వెంకటేష్, రాజేష్, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సుమన్ , శ్రీనివాస్, ఖో ఖో క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం క్రీడాకారుల్లో ఆరోగ్య చైతన్యాన్నిపెంపొందించడంతో పాటు యోగా ప్రాముఖ్యతను మరింతగా చాటిచెప్పింది. అనంతరం ఖేలో ఇండియా ఖోఖో సెంటర్ ఆధ్వర్యంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి సురేష్ కుమార్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.