తాళాలు వేసిన ఇండ్లే టార్గెట్.!
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.
బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
తిమ్మాజిపేట, నాగర్‌కర్నూల్ కేసులు ఛేదించిన పోలీసులు
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): పట్టపగలు తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు వేర్వేరు తేదీల్లో అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 13 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు బొల్లెమోని అంజి అలియాస్ స్వామి (26), జల్గరి ముత్తు (32), జల్గరి బాబు (32). వీరు గతంలో తెలంగాణలో 20–25 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉండి, పలుమార్లు జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామానికి చెందిన రైతు జిల్లెల్ల ధర్మరెడ్డి ఇంట్లో 2025 అక్టోబర్ 27న పట్టపగలు తాళం పగులగొట్టి బంగారు ఆభరణాలను దొంగిలించారు.
అలాగే వనపర్తి జిల్లాలోని వనపట్ల గ్రామంలోనూ ఇదే తరహాలో చోరీకి పాల్పడ్డారు. దొంగతనాల్లో అంజి ఇంట్లోకి ప్రవేశించి నగలు అపహరించగా, ముత్తు, బాబు బయట కాపలా కాసేవారని విచారణలో వెల్లడైంది. దొంగిలించిన నగలను విక్రయించి వచ్చిన డబ్బును ముగ్గురు పంచుకునేవారు. 2026 మే 30న నాగర్‌కర్నూల్ సంతబజార్‌లో బంగారు నగలు విక్రయించేందుకు వచ్చిన ముత్తు, బాబులను పోలీసులు పట్టుకుని ఒక బంగారు గొలుసు, మూడు బంగారు ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి జూలై 8న ఆర్టీసీ బస్టాండ్ వద్ద నగలు అమ్మేందుకు వచ్చిన అంజిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి నాలుగు బంగారు గాజులు, ఒక బంగారు నెక్లెస్, ఒక నల్లపూసల దండ, రెండు బంగారు నాణేలు, ఒక జత వెండి గొలుసులు స్వాధీనం చేసుకున్నారు.
తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 157/2025 కేసులో పోయిన 14.5 తులాల బంగారంలో 13 తులాలు రికవరీ చేయగా, నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 238/2025 కేసులో పోయిన 6 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులను పూర్తిగా రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లకు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కేసును ఛేదించిన సీఐ వై. అశోక్ రెడ్డి, ఎస్‌ఐలు కె. గోవర్ధన్, ఎం. రమేష్, పి. శ్రీనివాసరావుతో పాటు పోలీసు సిబ్బంది భీముడు, వెంకటేష్, రమేష్ లను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.






