విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చెయండి: పీడీఎస్‌యూ
ఇల్లందు టౌన్, జూలై 9 (విజయక్రాంతి): విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నేడు నిర్వహించే విద్యాసంస్థల బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు జయప్రదం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి జె. గణేష్ పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గేటు ఎదుట గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను 27 వేల నుంచి 4 వేలకు కుదించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తిస్థాయి మంత్రిని నియమించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు అందించాలని, మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, ఎంఈఓ, డీఈఓ, అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉచిత రవాణా, హాస్టళ్లకు శాశ్వత భవనాలు, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రావణ్, నవదీప్, చరణ్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.






